Asianet News TeluguAsianet News Telugu

Hassan Ali: పాపం.. కాస్త కనికరం చూపండి.. ఆ పాకిస్థాన్ క్రికెటర్ కు అండగా నిలుస్తున్న మాజీ కెప్టెన్

T20 World Cup: ‘మిగతా దేశాలలో క్రికెట్ ఒక  ఆట మాత్రమే. కానీ ఇక్కడ (పాకిస్థాన్) అలా కాదు. అక్కడ (ఇతర దేశాలలో) గేమ్ ఓడిన మరుసటి రోజు.. ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతారు కానీ ఇక్కడ  ఆ ఆస్కారం లేదు’ అంటున్నాడు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్.  

ICC T20 World Cup 2021: Aus vs Pak Wasim akram urges pakistan fans against targeting hassan ali
Author
Hyderabad, First Published Nov 12, 2021, 3:25 PM IST

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ అభిమానుల ఆశల కలలను కల్లలు చేసిన పలువురు క్రికెటర్లపై  సైబర్ దాడి తీవ్రమైంది. ఈ ఓటమిని తట్టుకోలేని పాక్ క్రికెట్ అభిమానులు.. ఇందుకు కారణమైన ఆటగాళ్లనే కాదు వారి భార్య, కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. జాబితాలో మొదట ఉన్నది పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ హసన్ అలీ. నిన్న  రాత్రి జరిగిన మ్యాచ్ లో మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేయడమే అతడు చేసిన నేరం. ఇందుకు గాను నెటిజనులు హసన్ అలీతో పాటు.. అతడి భార్యపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే  జట్టు నుంచి కూడా మద్దతు కరువైన హసన్ అలీకి.. పాక్ మాజీ  కెప్టెన్ వసీం అక్రమ్ అండగా నిలిచాడు. 

హసన్ అలీ, అతడి భార్యపై సోషల్ మీడియాలో దాడి నేపథ్యంలో ట్విట్టర్ లో అక్రమ్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ‘మనమేదైతే జరగొద్దని అనుకుంటున్నామో దేశవ్యాప్తంగా అదే జరుగుతున్నది. ఒక్క హసన్ అలీ నే కాదు. నేనూ ఇది (ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత) ఎదుర్కొన్నాను. వకార్ యూనిస్ కూడా అనుభవించాడు. మిగతా దేశాలలో క్రికెట్ ఒక గేమ్ మాత్రమే. కానీ ఇక్కడ (పాకిస్థాన్) అలా కాదు. అక్కడ (ఇతర దేశాలలో) గేమ్ ఓడిన మరుసటి రోజు.. దురదృష్టమో, మరోసారి ప్రయత్నిద్దామనో, బాగా ఆడారనో అనుకుని ముందుకు సాగుతారు. కానీ ఇక్కడ అలా కాదు..’ అని అన్నాడు. 

 

అంతేగాక.. ‘ఇలాంటి పరిస్థితి ఆటగాళ్లకే కాదు.. అభిమానులకు కూడా బాధాకరం.  మ్యాచ్ అయిపోయాక ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కుటుంబ సభ్యులతో కాదు.. కనీసం సహచరులతో కూడా మాట్లాడరు. ఓటమి వారిని వెంటాడుతూ ఉంటుంది.  ఒక దేశంగా మనం (పాక్ అభిమానులు) నిప్పుకు ఆజ్యం పోయొద్దు..’ అని అన్నాడు. హసన్ కు అండగా నిలవాలని, ఇది సమిష్టిగా ఆడే ఆటని అక్రమ్ సూచించాడు. 

 

ఆసీస్ తో ఓటమి అనంతరం పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హసన్ అలీ  భార్యను ఇండియన్ ఏజెంట్ గా అభివర్ణించారు. అలీ భార్య సమీయా అర్జోది ఇండియానే. దుబాయ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్న వీరిద్దరూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సమీయాతో పాటు ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే ఔటైన పాకిస్థాన్ వెటరన్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా పై కూడా పాక్ అభిమానులు ట్రోలింగ్ కు దిగుతున్నారు. ఆమె జాతీయతను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. అయితే ఇండియాకు చెందిన  పలువురు నెటిజన్లు మాత్రం.. హసన్ అలీ, ఆమె భార్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘IND Stand With Hassan ali’ హ్యాష్ ట్యాగ్ తో వారికి మద్దతు ప్రకటిస్తన్నారు. ట్విట్టర్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios