Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: కంగారూల దూకుడా..? పాక్ నిలకడా..? కివీస్ తో ఫైనల్ లో పోటీ పడేదెవరు..?

Australia Vs Pakistan: మునుపెన్నడూ లేనివిధంగా పాకిస్థాన్ జట్టు నిలకడకు మారుపేరుగా తయారైంది. ఆసీస్ కూడా బలంగానే ఉంది. ఇంగ్లాండ్ చేతిలో పరాజయాన్ని మినహాయిస్తే ఆ జట్టు టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నది. ఈ రెండు జట్ల మధ్య  నేటి సాయంత్రం ఆసక్తికర పోరు సాగనుంది. 

ICC T20 World Cup 2021: Aus Vs Pak Can Australia stop pakistan in 2nd semi final
Author
Hyderabad, First Published Nov 11, 2021, 11:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్ లో మిగిలింది రెండే మ్యాచులు. బుధవారం అబుదాబి వేదికగా జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోకి కివీస్ సేన.. పొట్టి ప్రపంచకప్ లో తొలి సారి ఫైనల్ కు చేరింది. ఇక నేడు రెండో సెమీస్ లో భాగంగా.. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ ను ఢీకొనబోతున్నది. టోర్నీలో ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పాకిస్థాన్.. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్నది. మరోవైపు అయిదు సార్లు వన్డే ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియా  ఇంతవరకు టీ20 ప్రపంచకప్ నెగ్గలేదు. దీంతో ఈసారి ఎలాగైనా దానిని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నది. ఆ మేరకు కంగారూలు టోర్నీలో దూకుడుగా ఆడుతున్నారు. ఈ రెండు జట్లు నేడు సెమీస్ పోరులో అమీతుమీకి సిద్ధమయ్యాయి. 

దుబాయ్ వేదికగా  గురువారం సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా పాకిస్థాన్ జట్టు నిలకడకు మారుపేరుగా తయారైంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని నాటి పాక్ జట్టును తలపిస్తూ.. బాబర్ ఆజమ్ సేన ఈ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నది. ఒకప్పుడు అనిశ్చితిగా మారుపేరుగా ఉన్న ఆ జట్టు.. ఈ టోర్నీలో అత్యంత నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నది. రెండో సారి పొట్టి క్రికెట్ కప్పు కొట్టి.. తమ దేశానికి విదేశీ జట్లను రప్పించాలనే లక్ష్యంతో ఆడుతున్న పాకిస్థాన్ ను ఎదుర్కోవడం ఆసీస్ కు ఇబ్బందే. 

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లతో సిరీస్ లు రద్దై.. ఒకరకంగా పాక్ క్రికెట్ సంధి కాలంలో ఉన్న సందర్భంలో ప్రపంచకప్ టోర్నీని ఆరంభించిన పాక్.. ఆది నుంచి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ ను చిత్తుచిత్తుగా ఓడించిన ఆ జట్టు.. తర్వాత మ్యాచులలో కూడా నిలకడైన ఆటతీరుతో అదరగొడుతున్నది. గతంలో కంటే భిన్నంగా.. ఒత్తిడికి తలవంచక తెగింపుతో ఆడుతున్నది. పాకిస్థాన్.. తన రెండో సొంతగడ్డగా భావించే యూఏఈలో చెలరేగుతున్నది. 

బలాబలాలు: 

బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ కు  టాపార్డర్ బలంగా ఉంది. ఓపెనింగ్ జోడీ.. బాబర్, మహ్మద్ రిజ్వాన్ లు అద్భుత ఆరంభాలతో జట్టు విజయాలకు పునాదులు వేస్తున్నారు. వాళ్లు విఫలమైనా.. అసిఫ్ అలీ, వెటరన్ షోయబ్ మాలిక్, హఫీజ్ ఆదుకుంటున్నారు. ఇక బౌలింగ్ పాకిస్థాన్ కు ఎప్పుడూ బలమే. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న షహీన్ షా అఫ్రిది, రవూఫ్ లు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. స్పిన్నర్లు ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, హఫీజ్ కూడా రాణిస్తున్నారు. 

మరో వైపు ఆసీస్ కూడా బలంగానే ఉంది. ఇంగ్లాండ్ చేతిలో పరాజయాన్ని మినహాయిస్తే ఆ జట్టు టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ దూకుడు స్మిత్ నిలకడ తోడైతే ఆసీస్ కు భారీ స్కోరు ఖాయం. వన్ డౌన్ లో వచ్చే షాన్ మార్ష్ కూడా ఫామ్ లో ఉన్నాడు.  ఈ టోర్నీలో ఇప్పటివరకు విజృంభించని గ్లెన్ మ్యాక్స్వెల్.. ఈ మ్యాచ్ లో జూలు విదిల్చాలని కంగారూలు కోరుకుంటున్నారు. బౌలింగ్ లో  ఆ జట్టు దుర్బేధ్యంగా ఉంది.  మిచెల్ స్టార్క్ నేతృత్వంలోని బౌలింగ్ దళం.. హెజిల్వుడ్, కమిన్స్ పేస్ విభాగం బలంగా ఉంది. స్పిన్నర్ ఆడమ్ జంపా రాణిస్తున్నాడు. 

వీళ్ల పోరు ఆసక్తికరం.. 

ఇరు జట్లకు తొలి పవర్ ప్లే కీలకం కానున్నది. అయితే ఈ సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న షహీన్ అఫ్రిది-డేవిడ్ వార్నర్.. బాబర్ ఆజమ్-మిచెల్ స్టార్క్ ల ఆట ఆసక్తికరంగా మారనున్నది. 

గత రికార్డులు.. 

కాగా..  ఆసీస్ కు ఇది మూడో టీ20 ప్రపంచకప్ సెమీస్.. అయితే వాళ్లు ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించారు. అది కూడా 2010 ప్రపంచకప్ లో  పాకిస్థాన్ పైనే. 2007, 2012 సెమీస్ లలో ఇండియా, వెస్టిండీస్ పై ఓడారు. పాకిస్థాన్ తో ఆడిన నాలుగు నాకౌట్ మ్యాచులలో ఆసీస్ దే విజయం. ఇక టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు ఇది నాలుగో సెమీస్. అందులో రెండు (2007 లో న్యూజిలాండ్ పై.. 2009లో సౌతాఫ్రికాపై) గెలిచింది. మరో రెండు (2010లో ఆసీస్ పై.. 2012 లో శ్రీలంకపై) ఓడింది. 

పాక్ దే ఆధిపత్యం.. 

పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 23 టీ20లు జరుగగా.. అందులో పాక్ దే ఆధిపత్యం. పాకిస్థాన్ 12 మ్యాచులు గెలువగా.. ఆసీస్ 9 గెలిచింది. ఒకటి టై కాగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇదిలాఉండగా.. యూఏఈలో పాకిస్థాన్ వరుసగా 16 మ్యాచులు గెలిచింది. చివరగా ఆ జట్టు 2015 నవంబరులో మాత్రమే ఓడింది. 

పిచ్.. 

దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పై మంచు ప్రభావం కూడా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. దుబాయ్ లో జరిగిన గత 11 మ్యాచులలో 10 సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం. 

జట్లు అంచనా:

ఆస్ట్రేలియా: డేవిడ్  వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్,  కమిన్స్, స్టార్క్, జంపా, హెజిల్వుడ్

పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హరిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది 

Follow Us:
Download App:
  • android
  • ios