Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: నేడే ఆసీస్-కివీస్ మహా సంగ్రామం.. తొలి కప్పును దక్కించుకునేదెవరో...?

Australia Vs New Zealand: దుబాయ్ వేదికగా నేటి సాయంత్రం 7:30 గంటలకు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయిదు వన్డే ప్రపంచకప్ లు నెగ్గినా ఇంతవరకూ టీ20 వరల్డ్ కప్ లేని లోటును పూడ్చుకోవాలని ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. తొలి టీ20 ప్రపంచకప్ నెగ్గాలని కేన్ విలిమయ్సన్ సేన కోరుకుంటున్నది. 

ICC T20 World Cup 2021: Aus vs NZ Who will lift Their First T20 Trophy in Final
Author
Hyderabad, First Published Nov 14, 2021, 12:11 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సుమారు 25 రోజులుగా క్రికెట్ అభిమానులకు ఆటతో పాటు వినోదాన్ని పంచుతున్న పొట్టి ప్రపంచకప్ ముగింపు వేడుకలకు  సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం దుబాయ్ వేదికగా ఇరుగు పొరుగు దేశాలైన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య తుది సమరం జరుగనున్నది. ఇరు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే కానున్నది. ఆస్ట్రేలియాకు ఇది రెండో టీ20 ప్రపంచకప్ ఫైనల్ కాగా.. న్యూజిలాండ్ కు పొట్టి ఫార్మాట్ లో ఇదే తొలి ఫైనల్. తమకు అచ్చొచ్చిన దూకుడు మంత్రంతోనే తొలి టీ20 ప్రపంచకప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని ఆసీస్ భావిస్తుండగా.. ప్రశాంతంగా ఉంటూ టోర్నీలు గెలవడం అలవాటు చేసుకున్న కివీస్ కూడా కామ్ గా పని ముగించేయాలని అనుకుంటున్నది. క్రికెట్ విశ్లేషకులు, అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ చేసిన ఈ దాయాదుల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది. 

దుబాయ్ వేదికగా నేటి సాయంత్రం 7:30 గంటలకు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయిదు వన్డే ప్రపంచకప్ లు నెగ్గినా ఇంతవరకూ టీ20 వరల్డ్ కప్ లేని లోటును పూడ్చుకోవాలని ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా భావిస్తున్నది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ తో మినహా ప్రతి మ్యాచ్ నెగ్గుకుంటూ ఫైనల్ చేరిన ఆసీస్.. ఫైనల్లో కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నది. బ్యాటింగ్ బలాన్ని నమ్ముకున్న ఆ జట్టు.. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే న్యూజిలాండ్ ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కివీస్ బలం. ఫీల్డింగ్  లో అయితే ఆ జట్టు ఇరగదీస్తున్నది. ప్రపంచ స్థాయి ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. 

ఏ జట్టు బలమెంత..? 

బ్యాటింగ్ ను నమ్ముకున్న ఆసీస్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ లు కీలకం. టాస్ కీలక పాత్ర పోషించే ఈ మ్యాచ్ లో తొలి పవర్ ప్లే అత్యంత  కీలకం కానున్నది. పవర్ ప్లే లో వీళ్లిద్దరూ జట్టుకు మంచి పునాధి వేస్తున్నారు. ఈ టోర్నీలో ఫామ్ లో ఉన్న వార్నర్.. ఆరు మ్యాచుల్లో 236 పరుగులతో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు  చేసిన ఆటగాడిగా ఉన్నాడు. సెమీస్ లో విఫలమైనా ఫించ్ కూడా ప్రమాదకారే. మిచెల్ మార్ష్,  స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఫైనల్ పోరులో అయినా విజృంభించాలని ఆసీస్ కోరుకుంటున్నది. గత మ్యాచ్ హీరోలు స్టాయినిస్, వేడ్ లు ఆ జట్టు బ్యాటింగ్ లోతును చెప్పకనే చెబుతున్నారు. 

బౌలింగ్ లో ఆసీస్ పేస్ త్రయం స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్ లు ఉన్నా  స్పిన్నర్ ఆడమ్ జంపా పైనే  ఆ జట్టు ఆశలన్నీ.  ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు మిచెల్, గప్తిల్, విలియమ్సన్, నీషమ్ లను వీళ్లు ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి. ఈ టోర్నీలో ఆసీస్ పేస్ త్రయం పెద్దగా ప్రభావం చూపకపోయినా.. జంపా మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ టోర్నీలో 12 వికెట్లు తీసిన జంపా... అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ ను అతడు ఇబ్బంది పెడతానడంలో సందేహం లేదు.  స్పిన్ ఆడటంలో కివీస్  విఫలమవుతున్న నేపథ్యంలో  జంపాను ఆపడం కివీస్ కు సవాలే. 

కివీస్ తక్కువ తిన్లేదు.. 

ఆస్ట్రేలియా అంత కాకపోయినా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్  కూడా భారీగానే ఉంది. అద్భుత ఆరంభాలివ్వడానికి మిచెల్, గప్తిల్ సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన గత మ్యాచ్ లో కివీస్ ను గెలిపించిన మిచెల్.. ఫైనల్లోనూ మెరవాలని చూస్తున్నాడు. గప్తిల్ కుదురుకుంటే ఆసీస్ కు చుక్కలే. వన్ డౌన్ లో వచ్చే కేన్ విలియమ్సన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో దిట్ట. అయితే  వికెట్ కీపర్ కాన్వే గాయపడటం ఆ జట్టుకు పెద్ద లోటు. అతడి స్థానంలో సీఫర్ట్ వచ్చినా.. అతడు ఏ మేరకు రాణిస్తాడో  చూడాలి. ఇక నీషమ్ ఆకలి మీదున్నాడు. ఫిలిప్స్ కూడా మెరవాలని చూస్తున్నాడు. 

బౌలింగే కివీస్ బలం. టిమ్ సౌథీ సారథ్యంలోని కివీస్ బౌలింగ్ దళం టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నది.   సీనియర్ పేస్ ద్వయం సౌథీ, బౌల్ట్ లు చెలరేగితే ఆసీస్ కు ఇబ్బందులు తప్పవు.  ఇక మిల్నె.. స్పిన్నర్లు సోధి, శాంట్నర్  లు టోర్నీలో  అదరగొడుతున్నారు.  స్లో పిచ్ లలో వాళ్లు  టర్న్ రాబడుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు  అంతేగాక సోధికి ఆసీస్ పై మంచి రికార్డుంది. ఆ జట్టుతో సోధి 9 మ్యాచులాడగా.. 15.68 సగటుతో ఏకంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో వార్నర్ మినహా ఆసీస్ బ్యాటర్లు స్పిన్ ను ఎదుర్కోవడంలో అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నారు.  ఈ బలహీనతను సోధి, శాంట్నర్ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. 

రికార్డులు.. 

ఇరు జట్లు ఇప్పటివరకు 14 టీ20లలో తలపడగా ఆసీస్ దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ 5 మ్యాచుల్లో గెలవగా.. ఆసీస్ 9 విజయాలతో ఆధిక్యంలో ఉంది. ఇక టీ 20 ప్రపంచకప్ లో రెండు జట్లు ఒకసారి (2016లో) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ దే విజయం. కానీ గత వన్డే ప్రపంచకప్ (2015)లో ఆసీస్ చేతిలో కివీస్ కు భంగపాటు తప్పలేదు.

ఇంకొంత.. 

ఆసీస్ కు  ఇది మొత్తంగా (వన్డేలు, టీ20లు కలిపి) తొమ్మిదో  ప్రపంచకప్ ఫైనల్. ఏ జట్టుకు కూడా ఇంతటి రికార్డులు లేవు. ఇందులో 5 సార్లు విజయం సాధించగా.. మూడింటిలో ఓడింది.  2010లో టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఆసీస్ కు ఓటమి ఎదురైంది.  ఇక కివీస్ కు ఇది నాలుగో ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్. 2015, 2019లో ఓడిపోగా.. ఈ ఏడాది జరిగిన టెస్టు ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. ఇది నాలుగో ఐసీసీ ఫైనల్. తొలి టీ20 ఫైనల్. 


విజేతను నిర్ణయించేది టాసే.. 

ఈ టోర్నీలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి విశ్లేషకులు పెద్దగా కష్టపడాల్సిన పన్లేకుండా పోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టుదే  విజయం. సూపర్-12 దశ నుంచి ఇప్పటివరకు దుబాయ్ (ఫైనల్ వేదిక) లో జరిగిన 12 మ్యచుల్లో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లే 11 సార్లు గెలిచాయి. అంతేగాక దుబాయ్ లో  జరిగిన గత 17 టీ20లలో 16 సార్లు  ఛేదనకు దిగిన జట్లదే  విజయం. ఒకరకంగా చెప్పాలంటే  టాస్ గెలిస్తే  మ్యాచ్ గెలిచినట్టే లెక్క. 

తుది జట్లు అంచనా.. 

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, స్మిత్, స్టాయినిస్, వేడ్, కమిన్స్, ఆడమ్ జంపా, హెజిల్వుడ్, స్టార్క్ 

న్యూజిలాండ్ : గప్తిల్, మిచెల్, విలియమ్సన్ (కెప్టెన్), ఫిలిప్స్, నీషమ్, సీఫర్ట్,  శాంట్నర్, మిల్నె, సౌథీ, సోధి,  బౌల్ట్

Follow Us:
Download App:
  • android
  • ios