Australia Vs Bangladesh: బంగ్లాదేశ్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని 7 ఓవర్లలోపే ఊదేసింది. 6.2 ఓవర్లలో 78 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది.  ఆరోన్ ఫించ్ వీరవిహారం చేసి బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు.

టీ20 ప్రపంచకప్ (T20 World cup 2021) లో బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా (bangladesh vs Australia) మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా (Australia) జట్టు.. బంగ్లాదేశ్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని 7 ఓవర్లలోపే ఊదేసింది. 6.2 ఓవర్లలో 78 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. ఆరోన్ ఫించ్ (Aaron Finch) వీరవిహారం చేసి బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు. బంగ్లా బ్యాటర్ల భరతం పట్టిన స్పిన్నర్ ఆడమ్ జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా.. 15 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (Adam Jampa).. 5 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. 

Scroll to load tweet…

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్.. ధనాధన్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపింది. ఓపెనర్లుగా వచ్చిన ఆరోన్ ఫించ్.. 20 బంతుల్లోనే 2 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో స్కోరుబోర్డును హైస్పీడ్ లో పరుగులు పెట్టించాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ (14 బంతుల్లో 18.. 3 ఫోర్లు) కూడా రెచ్చిపోయి ఆడాడు. 

ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్లో ఫోర్ కొట్టి బాదుడు ప్రారంభించిన ఫించ్.. అదే ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. అతడి 4 ఓవర్లో అయితే ఫించ్ వీరవిహారం చేశాడు. తొలి బంతికి వార్నర్ ఫోర్ కొట్టగా.. రెండో బంతి వైడ్ రావడంతో బైస్ రూపంలో రన్ తీయడంతో ఫించ్ స్ట్రైకింగ్ కు వచ్చాడు. మూడో బంతిని సిక్సర్ గా మలిచిన అతడు.. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తంగా 21 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు. 

ఐదో ఓవర్లో ఫించ్.. టస్కిన్ అహ్మద్ పనిపట్టాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ (5 బంతుల్లో 16.. 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆసీస్ విజయాన్ని ఖాయం చేశాడు. విజయానికి 20 పరుగుల దూరంలో వార్నర్ ఔటైనా.. మార్ష్ మిగిలిన పని పూర్తి చేశాడు. ఫలితంగా ఆసీస్.. లక్ష్యాన్ని 6.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. 

Scroll to load tweet…

బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ లకు ఫించ్ చుక్కలు చూపించడంతో వారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా రెహ్మాన్.. 2 ఓవర్లకే 32 పరుగులిచ్చాడు. కాగా ఈ విజయంతో గ్రూప్-1లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా లు చెరో 4 మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి 6 పాయింట్లతో సమానంగా ఉన్నా.. బంగ్లాతో మ్యాచ్ లో భారీ విజయంతో ఆసీస్ రన్ రేట్ ను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం ఆ జట్టు రన్ రేట్ .. +1.031 కాగా సౌతాఫ్రికా కు +0.742 ఉంది. తాజా విజయంతో సెమీస్ బెర్త్ కు ఆసీస్ మరింత దగ్గరైనట్టే లెక్క.