2019 విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కామెంటరీతో మొదలైన 2023 వన్డే వరల్డ్ కప్ ప్రోమో... విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తో పాటు శుబ్‌మన్ గిల్ కూడా.. 

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రోమోను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. వన్డే వరల్డ్ కప్ 2019 విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కామెంటరీతో మొదలైన ఈ ప్రోమోలో దినేశ్ కార్తీక్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్ వంటి మాజీ క్రికెటర్లు తళుక్కున మెరిశారు. 

2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత యువరాజ్ సింగ్ ఎమోషనల్ సెలబ్రేషన్స్‌తో పాటు 2019 వన్డే వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్, 2015 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ఏబీ డివిల్లియర్స్ ఎమోషనల్ అవ్వడం.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిన మూమెంట్స్‌తో జత చేసింది ఐసీసీ...

రోహిత్ శర్మ సిక్సర్, షాహీన్ ఆఫ్రిదీ వికెట్ సెలబ్రేషన్స్, జెమీమా రోడ్రిగ్స్ డ్యాన్స్, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్, సచిన్ టెండూల్కర్ బౌండరీ, క్లెవ్ లార్డ్ 1975 వన్డే వరల్డ్ కప్ లిఫ్టింగ్ మూమెంట్, కపిల్ దేవ్, రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్స్‌తో ఈ ప్రోమోలో జత చేసిన ఐసీసీ... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ధోనీ హెలికాఫ్టర్ షాట్ ఫినిషింగ్ షాట్‌, రవిశాస్త్రి కామెంటరీతో ప్రోమోను క్లైమాక్స్‌కి చేర్చింది..

గ్లోరీ అనే దగ్గర శుబ్‌మన్ గిల్ ఆఖర్లో మెరవగా షారుక్ ఖాన్, ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని చూపిస్తూ... ‘ఇది వన్డే వరల్డ్ కప్. దీని కోసమే బతుకుతారు, దీని కోసమే కలలు కంటారు. దీన్ని ఎత్తాలంటే ఒక్క రోజు (వన్డే) చాలు...’ అంటూ డైలాగ్‌తో ముగించాడు.

Scroll to load tweet…

అయితే ఈ ప్రోమోలో పాకిస్తాన్ ఓటమి తర్వాత బాధపడుతున్న ఓ పాక్ క్రికెట్ ఫ్యాన్‌ని, టీమిండియా అభిమాని భుజం పైన చేయి వేసి ఓదార్చడం హైలైట్‌గా చేసింది ఐసీసీ. దీనిపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రోమో నిండా ఇండియా, ఇంగ్లాండ్ తప్ప పాకిస్తాన్ గురించి కానీ, ఆస్ట్రేలియా గురించి కానీ ఎక్కువ చూపించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధపడుతున్న పాక్ అభిమానిని, టీమిండియా ఫ్యాన్ ఓదార్చినట్టు చూపించిన ఐసీసీ.. టీమిండియా అభిమానిని, పాక్ ఫ్యాన్ ఓదారుస్తున్నట్టు క్లిప్ పెట్టగలదా? అలా పెడితే బీసీసీఐ, టీమిండియా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అంటూ నిలదీస్తూ కామెంట్లు పెడుతున్నారు..