యాషెస్ సీరిస్ హీరో స్టీవ్ స్మిత్ ఐసిసి ర్యాకింగ్స్ లో పైపైకి ఎగబాకుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్ లో కోహ్లీని వెనక్కినెట్టి స్మిత్ అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రకటించిన ఐసిసి ర్యాకింగ్స్ లో కూడా స్మిత్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. గత ర్యాకింగ్స్ లో స్మిత్ కంటే కోహ్లీ కొన్ని పాయింట్లే వెనుకబడగా తాజాగా ఆ అంతరం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే స్మిత్ ఆల్ టైమ్ రికార్డును చేరువలో నిలిచాడు.  

ప్రస్తుతం స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో టాప్ లో నిలిచాడు.టీమిండియా కెప్టెన్ కోహ్లీ 903 రేటింగ్ పాయింట్లతో 34 పాయింట్లు వెనుకబడి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అయితే యాషెస్ సీరిస్ లో మరో టెస్ట్ మ్యాచ్ ఇంకా మిగిలివుంది. సీరిస్ విజయాన్ని నిర్ణయించే ఈ ఐదో టెస్ట్ లో కూడా స్మిత్ ఊపు కొనసాగితే తన కెరీర్ లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు(947) సాధించే అవకాశముంది. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన క్రికెటర్ గా నిలిచే అవకాశం కూడా అతడిముందుంది. 

ఆసిస్ మాజీ దిగ్గజం బ్రాడ్ మన్ 1948లో 961 రేటింగ్ పాయింట్లు పొంది  టెస్టుల్లో టాప్ ర్యాంకును  కైవసం చేసుకున్నాడు. ఇవే ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్స్. దీనికి స్మిత్  25 పాయింట్ల దూరంలో నిలిచాడు. ఈ యాషెస్ సీరిస్ లో కాకున్న సమీప భవిష్యత్ లో అతడు బ్రాడ్ మన్ రికార్డును బద్దలుగొట్టే అవకాశాలు పుష్కలంగా వున్నాయంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

టెస్ట్ బౌలర్ల ర్యాకింగ్స్ విషయానికి వస్తూ ఆసిస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 914 పాయింట్లతో టాప్ లో నిలిచాడు. కగిసో రబడ 851 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో,  టీమిండియా యువ సంచలన జస్ప్రీత్ సింగ్ బుమ్రా 835 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్లలో జేసన్ హోల్డర్  472, షకిబ్ అల్ హసన్ 397, రవీంద్ర జడేజా 389 పాయింట్లతో మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.