ICC ODI World Cup 2023:  భారత క్రికెట్ అభిమానులు  వేయి కండ్లతో ఎదురుచూస్తున్న  వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ నేడు విడుదల కానున్నట్టు బీసీసీఐ వర్గాల  ద్వారా తెలుస్తున్నది. 

పదేండ్ల తర్వాత భారత్ వేదికగా జరుగబోతున్న వన్డే వరల్డ్ కప్ లో తొలి ఘట్టం నేడు ఆవిష్కృతం కాబోతుందా..? వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్‌కు అంతా సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్ కు ఆడతామని అంగీకారం తెలపడంతో ఇక అడ్డంకులన్నీ తొలగిపోయి నేడు (జూన్ 27) పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... ‘వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ మంగళవారం విడుదల కానుంది. ఐసీసీ ఈవెంట్ ద్వారా దీనిని ప్రకటించనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ కూడా అంగీకారం తెలిపింది. డ్రాఫ్ట్ షెడ్యూల్ లో మార్పులేమీ లేవు..’అని తెలిపాడు. 

నేటి మధ్యాహ్నం 12 గంటలకు వరల్డ్ కప్ షెడ్యూల్ ను ముంబైలో ఘనంగా విడుదల చేసేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే రోజుతో వరల్డ్ కప్ ప్రారంభానికి వంద రోజుల కౌంట్ డౌన్ కూడా మొదలవనుంది. హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లలో ఈ కార్యక్రమం లైవ్ రానుంది. 

సెమీస్ వేదికలలో మార్పులు.. 

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్స్ మ్యాచ్ లను ముంబైలోని వాంఖెడేతో పాటు చెన్నై లేదా బెంగళూరు లలో ఏదో ఒక స్టేడియం వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ ఆఖరి నిమిషంలో సెమీస్ వేదిక మారినట్టు తెలుస్తున్నది. వాంఖెడేలో మొదటి సెమీస్, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో రెండో సెమీస్ నిర్వహించనున్నట్టు సమాచారం. దీనిపై నేడు విడుదల (?) కాబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో పూర్తి వివరాలు వెల్లడవుతాయి. 

Scroll to load tweet…

అంతరిక్షంలో ట్రోఫీ ఆవిష్కరణ 

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని వినూత్నంగా ఆవిష్కరించింది. ఈ ట్రోఫీని భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో వున్న స్ట్రాటోస్ఫియర్ ఆవరణలోకి పంపించింది. దానికి అమర్చిన 4కే కెమెరాలతో కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. త్వరలోనే ఈ ట్రోఫీ వరల్డ్ టూర్‌కు వెళ్లనుంది. కువైట్, బహ్రెయిన్, మలేషియా, అమెరికా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలను చుట్టిరానుంది.


Scroll to load tweet…