వన్డే వరల్డ్ కప్ 2019: రికార్డులు బద్దలు... క్రికెటర్లే కాదు ఈసారి అభిమానులు కూడా
ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో ప్రతిసారి ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తుంటారు. అయితే ప్రతిసారి వారేనా ఈసాారి తాము కూడా ట్రై చెద్దామని అనుకున్నారో ఏమో గానీ వరల్డ్ కప్ 2019 లో అభిమానులు ఓ రికార్డును నెలకొల్పారు.

ఇంగ్లాండ్ వేదికన జరిగిన వన్డే ప్రపంచ కప్ మరో సూపర్ రికార్డును నమోదు చేసింది. ఈ టోర్నీలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్ళు అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే అభిమానులు కూడా ఆటగాళ్ల బాటలోనే నడిచి ఓ అద్భుత ఘనత సాధించారు. ఇప్పటివరకు జరిగిన వన్డే ప్రపంచ కప్స్ అన్నింటిలోకెల్లా ఈసారి జరిగిన మెగా టోర్నీ అత్యంత ప్రజాదరణను పొంది గత రికార్డులను బద్దలుగొట్టింది.
ఈ వరల్డ్ కప్ మ్యాచులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 కోట్ల మంది వీక్షించినట్లు ఐసిసి ప్రకటించింది. ప్రత్యక్షంగా మైదానానికి ప్రత్యక్షంగా వచ్చినవారు, టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్ ఇలా వివిధ మాద్యమాల ద్వారా ఈ టోర్నీ వీక్షించినవారి సంఖ్య మొత్తాన్ని కలిపి లెక్కించినట్లు తెలిపింది. ఇలా ఇప్పటివరకు అత్యధికమంది వీక్షించిన టోర్నీగా ప్రపంచ కప్ 2019 నిలిచింది.
ఇక ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ను అత్యధికమంది ప్రత్యక్షంగా వీక్షించినట్లు ఐసిసి తెలిపింది. ఈ మ్యాచ్ ను కేవలం టీవీల్లోనే 27 కోట్ల మంది చూడగా వివిధ యాప్ ల ద్వారా మరో 5 కోట్ల మంది చూశారట. మొత్తంగా 32 కోట్లమంది వీక్షకులతో ఈ మ్యాచ్ టాప్ లో నిలిచింది.
ఈ మెగా టోర్నీ 200 దేశాల్లో ప్రత్యక్షంగా ప్రసారమైనట్లు... ఇందుకోసం 25 ప్రసార మాధ్యమాల సహకారం పొందామని ఐసిసి తెలిపింది. ఇలా ముందుగానే విస్తృత ప్రచారం కల్పించడం, అభిమానుల ఆసక్తి వెరసి ఈ వన్డే ప్రపంచ కప్ ఆల్ టైమ్ రికార్డును సాధించింది.