Asianet News TeluguAsianet News Telugu

ODI World Cup 2023: తొలి పోరు న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల బలాలు, పిచ్ రిపోర్టు ఎలా ఉన్నాయంటే..

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. వన్డే ప్రపంచ కప్-2023 మహా సంగ్రామం భారత్ వేదికగా ఈరోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌.. గత వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ జట్టు న్యూజిలాండ్ మధ్య జరగనుంది.

icc odi world cup 2023 first match england vs new zealand match preview pitch weather report ksm
Author
First Published Oct 5, 2023, 1:04 PM IST | Last Updated Oct 5, 2023, 1:19 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. వన్డే ప్రపంచ కప్-2023 మహా సంగ్రామం భారత్ వేదికగా ఈరోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌.. గత వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ జట్టు న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా నిలవనుంది. వన్డే వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లలో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉండటంతో.. మ్యాచ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, పిచ్, వాతావరణ నివేదికలను ఒకసారి పరిశీలిద్దాం.. 

ఇంగ్లండ్ జట్టు..
2019 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. అంతేకాకుండా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కూడా ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌కు అటాకింగ్‌ గేమ్‌ అతిపెద్ద బలంగా ఉంది. బ్యాటింగ్‌లోనైనా, బౌలింగ్‌లోనైనా.. ఇంగ్లండ్ టీమ్ నిరంతరం అటాకింగ్‌పై నమ్మకంతో ఉంటుంది.ఇంగ్లండ్ జట్టులో 11వ నెంబర్ వరకు బ్యాట్స్‌మెన్ ఉన్నారని చెప్పవచ్చు. అంటే ఇంగ్లండ్ జట్టు ఆల్ రౌండర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్‌కు మంచి సారథి అనే పేరుంది. ఇక, బౌలింగ్‌లో కూడా ఇంగ్లండ్ బలంగా కనిపిస్తుంది. అయితే బెన్ స్టోక్స్‌కు గాయం కావడంతో.. అతడు తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందేహం నెలకొంది.

న్యూజిలాండ్ జట్టు..
2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఎలాగైనా విజయం సాధించాలని న్యూజిలాండ్ భావిస్తుంది. న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే.. జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో నిండి ఉంది. న్యూజిలాండ్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ వంటి అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్ వంటి యువ బౌలర్లు కూడా ఉన్నారు. జట్టులో ఆల్ రౌండర్ల సంఖ్య కూడా ఇంగ్లండ్ కంటే తక్కువేమీ కాదు. వార్మప్ మ్యాచ్‌లో 97 పరుగుల ఇన్నింగ్స్‌తో రాణించిన.. రచిన్ రవీంద్ర వంటి యువ ఆల్ రౌండర్ కూడా జట్టులో ఉన్నాడు.

అయితే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం.. కివీస్ జట్టకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. కివీస్ జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సౌదీకి ఇటీవల బొటనవేలు శస్త్రచికిత్స జరిగింది.

పిచ్, వెదర్ రిపోర్టు..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరూ సహాయం పొందుతారు. అయితే ఎక్కువగా బ్యాటర్లు పరుగులు చేసేందుకు అవకాశం ఉంది. ఈ పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం చేస్తుంది. అయితే చివరికి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ 300 కంటే ఎక్కువ పరుగులు సులభంగా స్కోర్ చేయవచ్చు. వాతావరణ విషయానికొస్తే.. అహ్మదాబాద్‌లో ప్రస్తుతానికి వర్షాలు కురిసే అవకాశాలు లేవు.


తుది జట్లు (అంచనా)
ఇంగ్లండ్‌: జానీ బెయిర్‌స్టో, మలన్, రూట్, హ్యారీ బ్రూక్‌, బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌ స్టోన్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, మాట్ హెన్రీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios