అక్కడ అంపైర్లందరూ అతివలే.. వరల్డ్ కప్‌తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఐసీసీ
Women's T20 World Cup 2023: ఫిబ్రవరి 10 నుంచి మొదలుకాబోతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో ఐసీసీ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఈ టోర్నీ పర్యవేక్షించేది అతివలే.

‘పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించడం ఓ లెక్కా వీళ్లకు...’అంటాడు అరవింద సమేత సినిమా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ఆ డైలాగ్ వెనుక నిగూఢ అర్థం దాగి ఉంది. మహిళల అభ్యున్నతిని కాంక్షించే వారెవరైనా వారిని అన్నిరంగాల్లో ముందడుగు వేయనీయాలి. తాజాగా ఐసీసీ కూడా ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. పురుషుల క్రికెట్ తో పాటు సమానంగా ఎదుగుతున్న మహిళల క్రికెట్ లో త్వరలో నిర్వహించబోతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో ఒక్క పురుష అంపైర్ కూడా ఉండడు. అక్కడ అంతా అతివలదే రాజ్యం..
ఈనెల 10 నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో భాగంగా ఐసీసీ ఇటీవలే అంపైర్ల ప్యానెల్ ను ప్రకటించింది. మ్యాచ్ లను సజావుగా నిర్వహించేందుకు అంపైర్లు కీలక పాత్ర పోషిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ప్రపంచకప్ లో మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీలు కూడా మహిళలే ఉండనున్నారు.
ఈ మేరకు ఐసీసీ.. 13 మందితో కూడిన అంపైర్ల ప్యానెల్ ను ప్రకటించింది. వీరిలో 10 మంది ఆన్ ఫీల్డ్ అంపైర్లు కాగా ముగ్గురు మ్యాచ్ రిఫరీలు. వారి పేర్లు, వివరాలు ఇక్కడ చూద్దాం.
మ్యాచ్ రిఫరీలు :
- జీఎస్ లక్ష్మీ (ఇండియా)
- షాండ్ర్ ఫ్రిట్జ్ (సౌతాఫ్రికా)
- మిచెల్ పెరేరియా (శ్రీలంక)
ఆన్ ఫీల్డ్, టీవీ అంపైర్లు :
- సూ రెడ్‌ఫర్న్ (ఇంగ్లాండ్)
- షెరిడాన్ (ఆస్ట్రేలియా)
- క్లేయిర్ పొలొసొక్ (ఆస్ట్రేలియా)
- జాక్వలిన్ విలియమ్స్ (వెస్టిండీస్)
- కిమ్ కాటన్ (న్యూజిలాండ్)
- లారెన్ (సౌతాఫ్రికా)
- అన్నా హరీస్ (ఇంగ్లాండ్)
- వృందా రతి (ఇండియా)
- ఎన్. జనని (ఇండియా)
- నిర్మలి పెరెరా (శ్రీలంక)
- ఈ జాబితాలో ముగ్గురు భారత్ నుంచే ఉండటం గమనార్హం.
- ఈ టోర్నీలో భాగంగా జరిగే తొలి మ్యాచ్ (సౌతాఫ్రికా - శ్రీలంక) కు హరీస్, కాటన్ లు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. కాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఇది కీలక ముందడుగు అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.