ఈ ఏడాది జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి అరుదైన ఘటన జరిగింది. విజేతకు బహూకరించే వరల్డ్ కప్‌ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని వినూత్నంగా ఆవిష్కరించింది. ఈ ట్రోఫీని భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో వున్న స్ట్రాటో ఆవరణలోకి ప్రవేశపెట్టింది. ఈ ఐకానిక్ వరల్డ్ కప్ ట్రోఫీని బెస్పోక్ స్ట్రాటోస్పియర్ బెలూన్‌కు జోడించి ఆకాశంలోకి పంపారు. అనంతరం ఆ బెలూన్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో సేఫ్‌గా దిగింది. ఐసీసీ పురుషుల ప్రపంచకప్ ట్రోఫీ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. అదే రోజు ముంబైలో ప్రపంచపకప్‌ షెడ్యూల్ ప్రకటించనుంది. 

Scroll to load tweet…

త్వరలో ఈ ట్రోఫీ కువైట్, బహ్రెయిన్, మలేషియా, అమెరికా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలను చుట్టిరానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని పరిమితుల వున్నందున 2019 తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్న తొలి ట్రోఫీ టూర్ ఇదే . స్ట్రాటో ఆవరణలో ట్రోఫీ ప్రయాణిస్తుండగా.. బెలూన్‌కు జోడించిన 4కే కెమెరాలు భూ వాతావరణం అంచున వున్న ట్రోఫీ వీడియోలను బంధించాయి. 

ట్రోఫీ టూర్‌పై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. మరే ఇతర క్రీడల్లోనూ లేని విధంగా క్రికెట్ భారతదేశాన్ని ఏకం చేస్తుందన్నారు. ఆరువారాల పాటు ప్రపంచంలోని పది అత్యుత్తమ జట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమవుతున్న వేళ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోందన్నారు. తాము (బీసీసీఐ) క్రికెట్ ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ చేస్తున్నందున .. ట్రోఫీ టూర్ వల్ల అభిమానులు ఏ మూలన వున్నా ఈ ఈవెంట్‌లో భాగం కావడానికి ఒక అద్భుతమైన అవకాశమని జై షా పేర్కొన్నారు. ట్రోఫీ టూర్ భారతదేశవ్యాప్తంగా ప్రయాణిస్తుందని, దేశంలోని ఐకానిక్ వేదికలు, నగరాలు, ల్యాండ్‌మార్క్‌లుగా ఇదిసాగుతుందని జైషా తెలిపారు. 

Scroll to load tweet…

క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీ టూర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ ట్రోఫీ టూర్ కౌంట్‌డౌన్‌కు సంబంధించి అతిపెద్ద మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ పర్యటనలో ఐకానిక్ సిల్వర్ వేర్ రాష్ట్రాధినేతలను కలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రఖ్యాత ల్యాండ్‌మార్క్‌లను సందర్శిస్తుందని, క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలకు మద్ధతు ఇస్తుందని జియోఫ్ చెప్పారు.