ఇంగ్లాండ్, ఇండియా మధ్య మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన డే- నైట్ టెస్టు పిచ్‌పై పర్యాటక జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు, 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

తమ ఓటమికి నాణ్యతలేని పిచ్ కారణమని ఆరోపించిన ఇంగ్లాండ్ జట్టు, ‘టెస్టులకి ఈ పిచ్ ఏ మాత్రం పనికి రాదంటూ’ సమీక్షించాల్సిందిగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇంగ్లాండ్ ఫిర్యాదుతో పిచ్‌ను పరీక్షించిన ఐసీసీ, అహ్మదాబాద్ పిచ్‌‌కి ‘యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది.

పిచ్‌కి యావరేజ్ రేటింగ్ రావడంతో టీమిండియాకి ఎలాంటి నష్టం కలగదు. పిచ్‌లో నాణ్యతలోపం ఉన్నట్టుగా ఐసీసీ భావిస్తే, టీమిండియా టెస్టు ఛాంపియన్‌షప్ పాయింట్లలో కోత పడేది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకి ఆలౌట్ కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ 66 పరుగులు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు.