ICC Cricket World Cup 2023 : ఆ సీక్రేట్ మాత్రం చెప్పను.. మీరు ఇంగ్లీష్ లో బయటపెడితేనో : జడేజా ఫన్నీ కామెంట్స్
ప్రపంచ కప్ 2023 లో ఆడిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా విజయం సాధించడంలో స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. అయితే తన స్పిన్ బౌలింగ్ పై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జడేజా ఆసక్తికర సమాధానం చెప్పాడు.
చెన్నై : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో టీమిండియాకు శుభారంభం లభించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ ను భారత స్పిన్పర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా బంతిని గింగిరాలు తిప్పుతూ కంగారూలనే కంగారెత్తించాడు. అతడి స్పిన్ మాయాజాలానికి బలమైన ఆసిస్ టాపార్డర్ కూడా తలవంచక తప్పలేదు. ఇలా కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా తన స్పిన్ మాయాజాలం వెనకున్న సీక్రెట్ ను మాత్రం బయటపెట్టేందుకు ఇష్టపడటం లేదు.
ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం అనంతరం జడేజా మీడియాతో మాట్లాడారు. ప్రతిసారీ ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వికెట్ మీకే దక్కుతుంది... అతడిని ఔట్ చేసేందుకు మీరు వాడుతున్న ఆ సీక్రెట్ ఏంటో బయటపెట్టాలని ఓ రిపోర్టర్ జడేజాను అడిగాడు. ''అస్సలు బయటపెట్టను... ఆ సీక్రెట్ ఏంటో చెబితే మీరు ఇంగ్లీష్ లో ప్రింట్ చేస్తారు. అదికాస్తా స్మిత్ కు తెలిసిపోతుంది. కాబట్టి నేను చెప్పను'' అంటూ తనదైన స్టైల్లో చమత్కరించాడు జడేజా.
వన్డేలే కాదు ఇతర ఫార్మాట్లలో కూడా స్మిత్ పై జడేజాదే పైచేయిగా నిలుస్తోంది. ఆసిస్, ఇండియా మధ్య జరిగిన చాలా మ్యాచుల్లో స్మిత్ వికెట్ జడేజాకే దక్కుతోంది. అతడి స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంతో విఫలమవుతున్న ఆసిస్ కెప్టెన్ వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఇలా ఆదివారం ఆడిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో మరోసారి బంతితో మాయచేసి స్మిత్ వికెట్ పడగొట్టాడు జడేజా. క్రీజులో కుదురుకుని భయంకరంగా మారుతున్న సమయంలో స్మిత్ వికెట్ పడగొట్టి ఆసిస్ పతనాన్ని శాసించాడు జడేజా.
Read More ICC Cricket World Cup 2023 : ఆసిస్ పై గెలిచినా ఆనందమేదీ..! టీమిండియా ఖాతాలో ఆ చెత్త రికార్డ్
ఇలా మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. రవీంద్ర జడేజాకు కుల్దీప్ యాదవ్, బుమ్రా తోడవడంతో ఆసిస్ కేవలం 199 పరుగులకే కుప్పకూలింది. వార్నర్, స్మిత్ మధ్యలో కొద్దిసేపు వికెట్ పడకుండా అడ్డుపడటంతో ఆసిస్ ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది.
200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను కూడా ఆసిస్ బౌలర్లు ఆదిలోనే దెబ్బతీసారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తో పాటు శ్రేయాస్ అయ్యర్ ను పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు పంపించారు. ఇలా ఆసిసి బౌలర్లు స్టార్క్, హజిల్ వుడ్ దాటికి నిలవలేక ముగ్గురు భారత టాపార్డర్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ (85 పరుగులు), కేఎల్ రాహుల్ (97 పరుగులు) అద్భుతంగా ఆడి టీమిండియాను విజయతీరాలను చేర్చారు.