క్రికెట్‌ దిగ్గజం, శ్రీలంక జాతీయ జట్టు మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చైర్మన్‌ రేసులో నిలుపుతున్నట్టు శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. 

ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం త్వరలోనే ముగియనున్న విషయం తెలిసిందే! ఐసీసీ నూతన రాజ్యాంగం ప్రకారం వరల్డ్‌ బాడీ చైర్మన్‌ ఏ సభ్య దేశ క్రికెట్‌ బోర్డుకు కూడా నాయకత్వం వహించాల్సిన పని లేదు (గతంలో ఐసీసీ చైర్మన్, ఏదైనా ఒక దేశ క్రికెట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించేవాడే అయి ఉండాలన్న నిబంధన ఉండేది)

ప్రస్తుత చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ ఇప్పుడు బీసీసీఐలో ఎటువంటి పదవిలో లేడు. జెంటిల్‌మెన్‌ క్రికెటర్‌గా పేరొందిన కుమార సంగక్కర ప్రస్తుతం ఎంసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. 

కరోనా వైరస్‌ విపత్తు నేపథ్యంలో మరో ఏడాది ఎంసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు సంగక్కరకు అవకాశం ఉంది.అయినప్పటికీ కూడా సంగక్కర ఆ పదవి గడువు ముగియగానే, వదిలేసి వెనక్కి రావాలని కోరుతోంది. 

సంగక్కరను ఈ రేసులో గెలిపించుకునేంత మద్దతు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో శ్రీలంకకు లేకపోయినా...... సంగక్కర వంటి క్రికెట్‌ ప్రొఫెషనల్‌ రేసులో ఉంటే సమీకరణాలు మారేందుకు ఆస్కారం ఎక్కువ అని, తద్వారా సంగక్కర ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు ఆస్కారముందని భావిస్తోంది లంక క్రికెట్ బోర్డు. 

ఎంసీసీలో సంగక్కర బాధ్యతల ముగింపు కోసం ఎదురుచూస్తున్నామని, అక్కడ అతడి బాధ్యతలు ముగియగానే శ్రీలంక క్రికెట్‌ బోర్డు సంగక్కర సేవలు వినియోగించుకుంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ మోహన్‌ డిసిల్వ చెప్పాడు. 

ఐసీసీ చైర్మన్‌ పదవికి సైతం సంగక్కరను నామినేట్‌ చేయాలని అనుకుంటున్నామని, అందుకు బలమైన అవకాశం ఉందని, ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా ఐసీసీ చైర్మన్‌గా లంకేయులు కొనసాగలేదని  మోహన్‌ డిసిల్వ అన్నాడు. 

ఐసీసీ చైర్మన్‌ పదవికి సంగక్కర తగిన వ్యక్తని, సంగక్కర నామినేషన్‌పై శ్రీలంక అధికారికంగా ప్రకటించిన వెంటనే, ఇతర దేశాల మద్దతు కూడగడుతామని శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మోహన్‌ డిసిల్వ తెలిపారు.