క్వాలిఫై రౌండ్ ఆడకుండానే.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నెదర్లాండ్స్.. 2024 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత
T20 World Cup 2022: సంచలన విజయాలతో టీ20 ప్రపంచకప్ లో అద్భుతాలు చేసిన నెదర్లాండ్స్ బంపరాఫర్ కొట్టింది. 2024 టీ20 ప్రపంచకప్ ఎడిషన్ లో పాల్గొనబోయే జట్లలో నేరుగా అర్హత సాధించింది.
టీ20 ప్రపంచకప్‌కు అనామకులుగా వచ్చి అద్భుతాలు చేసిన జట్లలో నెదర్లాండ్స్ కూడా ఒకటి. ఈ మెగా టోర్నీలో క్వాలిఫై రౌండ్ ఆడేందుకు అర్హత సాధించిన నెదర్లాండ్స్.. క్వాలిఫై రౌండ్స్ లో గ్రూప్ - ఏ నుంచి టాప్-2 టీమ్ గా వచ్చి సూపర్-12కు కూడా అర్హత సాధించింది. గ్రూప్-2లో కూడా దక్షిణాఫ్రికా వంటి మేటి జట్టుకు షాకిచ్చిన నెదర్లాండ్స్ ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండింట్లో నెగ్గింది. బంగ్లాదేశ్ ను కూడా వెనక్కినెట్టి టాప్-4లో నిలిచింది. ఈ ప్రదర్శనల ద్వారా నెదర్లాండ్స్ కు బంపరాఫర్ దక్కింది. 2024 లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ లో టాప్-8 లో నిలిచిన జట్లకు తర్వాతి టోర్నీకి నేరుగా అర్హత పొందే అవకాశం కల్పిస్తారు. ఆ ప్రకారం నెదర్లాండ్స్ కూడా టాప్-8లో ఉండంతో డచ్ జట్టు క్వాలిఫై అయింది. మొత్తంగా ఈ ఎడిషన్ లో 12 జట్లు నేరుగా క్వాలిఫై అయ్యాయి. వాటి జాబితా ఒకసారి చూద్దాం.
క్వాలిఫై జట్ల జాబితా ఇలా..
2024లో యూఎస్ఏ-వెస్టిండీస్ దీవులలో నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్ కు గాను తాజా ప్రపంచకప్ లో సెమీస్ కు అర్హత సాధించిన నాలుగు జట్లు ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ నేరుగా క్వాలిఫై అయ్యాయి. వీటితో పాటు గ్రూప్-1లో ఆస్ట్రేలియా, శ్రీలంక లు, గ్రూప్-2లో సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ లు నేరుగా అర్హత సాధించాయి.
ఇక నెదర్లాండ్స్ కంటే తక్కువ పాయింట్లు సాధించిన బంగ్లాదేశ్ 9 వ స్థానంలో క్వాలిఫై ఛాన్స్ దక్కించుకోగా.. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకున్నా ఐసీసీ ర్యాంకుల ఆధారంగా అఫ్గానిస్తాన్ కూడా వచ్చే ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించింది.
ఆతిథ్య దేశాలకూ..
టాప్-10 జట్ల సంగతి పక్కనబెడితే.. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న యూఎస్ఎ, వెస్టిండీస్ లకు నేరుగా అర్హత కల్పించారు నిర్వాహకులు. దీంతో ఈ ఏడాది క్వాలిఫై రౌండ్ ఆడి అక్కడే నిష్క్రమించి ప్రపంచకప్ ఆడలేకపోయిన రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ వచ్చే ఎడిషన్ లో నేరుగా ఆడనుంది. ఇప్పుడిప్పుడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న యూఎస్ఎకు కూడా ఇదే అవకాశం దక్కింది.
20 టీమ్ లతో..
వచ్చే టీ20 ఎడిషన్ ను 20 టీమ్స్ తో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నది. ఇందుకు గాను మిగిలిన 8 జట్లను ఆఫ్రికా, యూరప్, అమెరికా, ఆసియా ఖండాల నుంచి వివిధ దేశాలకు టోర్నీలు నిర్వహించి వాటి నుంచి టాప్-8 జట్లను క్వాలిఫై రౌండ్ ఆడించనున్నారు.