Kohli vs Ganguly: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ను అభిమానులు కోహ్లీ వర్సెస్ గంగూలీ  మ్యాచ్ గా చూస్తున్నారు. 

ఐపీఎల్-16 లో ఆరు రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముగిసిన లో స్కోరింగ్ థ్రిల్లర్ లో హై ఓల్టేజ్ డ్రామా సాగిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్, గౌతం గంభీర్ ల మధ్య వాగ్వాదాలు ఈ మ్యాచ్ ను ఫుల్ కాంట్రవర్సీ గేమ్ గా మార్చాయి. ఇప్పుడు మరో కాంట్రవర్సీ ఆన్ కార్డ్స్ లో ఉండనుంది అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్. నేడు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరుగనుంది. 

ఈ మ్యాచ్ ను ఆర్సీబీ వర్సెస్ డీసీ అనేకంటే కోహ్లీ వర్సెస్ గంగూలీ అంటే అతికినట్టు సరిపోతుంది. ఐపీఎల్ - 16లో భాగంగా ఏప్రిల్ 15న ఢిల్లీ - బెంగళూరు జట్లు చిన్నస్వామి లో ఢీకొన్నాయి. ఈ మ్యాచ్ ను ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు కోహ్లీ వర్సెస్ గంగూలీ మ్యాచ్ గా చూశారు. 

తాజాగా ఫిరోజ్ షా కోట్ల (అరుణ్ జైట్లీ స్టేడియం) లో మరోసారి కోహ్లీ వర్సెస్ దాదా పోరు జరుగనుంది. శనివారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తే అది గంగూలీకి ట్రిబ్యూట్ ఇచ్చినట్టే అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్. ఈ మ్యాచ్ ను అతడు ‘గోల్డెన్ మ్యాచ్’గా అభివర్ణించాడు.

స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఓ వీడియోలో శ్రీశాంత్ మాట్లాడుతూ.... ‘ఐపీఎల్ లో ఇది (ఢిల్లీ వర్సెస్ బెంగళూరు) గోల్డెన్ మ్యాచ్. ఇది చాలా ఎగ్జయిటింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే.. నెంబర్ వన్ పాయింట్ - విరాట్ కోహ్లీ వర్సెస్ వార్నర్. ఢిల్లీ ఇటీవలే గుజరాత్ ను ఓడించి జోరుమీదుంది. ఆర్సీబీ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. 

పాయింట్ నెంబర్ 2 - నోర్జే. ఈ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చూడటం బాగుంటుంది. ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు.. అన్నింటికంటే ముఖ్యమైనది మరోటి ఉంది.. ఈ మ్యాచ్ లో కోహ్లీ గనక సెంచరీ చేస్తే అది దాదాకు గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చినట్టే..’అని చెప్పుకొచ్చాడు.

Scroll to load tweet…

కాగా బెంగళూరులో ముగిసిన ఢిల్లీ - ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ.. దాదా వైపు ఉరిమి చూడటం.. ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకపోవడం వంటి దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది ముగిశాక మరుసటి రోజే కోహ్లీ, గంగూలీలు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో ఒకరికి ఒకరు ‘అన్‌ఫాలో’ చేసుకున్నారు. మరి మొన్న లక్నోలో రచ్చ చేసిన కోహ్లీ నేడు తన సొంత గ్రౌండ్ (ఢిల్లీ) లో ఏం చేస్తాడో చూడాలి.