Australia Tour Of Pakistan: రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా..   పాక్ తో సిరీస్ ముగిశాక  ఐపీఎల్ కు ఆటగాళ్లు..  నాలుగు నెలల దాకా  విశ్రాంతి లేని షెడ్యూల్...

సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా.. ఉపఖండంలో సిరీస్ నెగ్గాలని భావిస్తున్నది. సిరీస్ టార్గెట్ గా వస్తున్న ఆసీస్ జట్టులో కీలక ఆటగాడైన డేవిడ్ వార్నర్.. కంగారూలు పాక్ కు బయల్దేరే ముందు తన భార్యా పిల్లలను ఉద్దేశించి భావోద్వేగ కామెంట్స్ చేశాడు. ఇంతకాలం భార్యా, పిల్లలతో కలిసి విలువైన సమయం గడిపిన వార్నర్ భాయ్.. సోషల్ మీడియా వేదికగా వారి ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టును రాసుకొచ్చాడు. పాకిస్థాన్ పర్యటనకు వచ్చే ఆసీస్ బృందంలో సభ్యుడైన వార్నర్.. ఆ టూర్ తర్వాత నేరుగా ఐపీఎల్ కు రానున్నాడు. 

మార్చి నుంచి మే దాకా వార్నర్ కుటుంబాన్ని విడిచి ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన వార్నర్.. ‘నా గర్ల్స్ (భార్యా కూతుళ్లు) కు గుడ్ బై చెప్పడం నాకు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా నేను వాళ్లతో ఎంతో విలువైన సమయం గడిపాను. కానీ ఇప్పుడు కొన్ని నెలలు మిమ్మల్ని విడిచి ఉండాల్సి వచ్చింది. 

మనం మళ్లీ త్వరలోనే కలుసుకుంటాం.. అప్పటిదాకా నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను..’ అని భార్య క్యాండీ, పిల్లలు ఇవి, ఇండీ, ఇస్లాలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. వార్నర్ ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే అతడి భార్య కామెంట్ చేసింది. 

View post on Instagram

వార్నర్ పోస్టుపై ఆమె స్పందిస్తూ.. ‘నువ్వు మళ్లీ గ్రౌండ్ లో దుమ్ముదులపడాన్ని చూసేందుకు మేము ఆసక్తిగా చూస్తున్నాం. మేము కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. లవ్ యూ..’ అని రాసుకొచ్చింది. వార్నర్ షేర్ చేసిన ఫోటోలకు సంబంధించిన పోస్ట్, క్యాండీ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.

1998లో పాక్ పర్యటనకు వచ్చిన ఆసీస్.. ఆ తర్వాత మళ్లీ ఆ దేశానికి రాలేదు. 2000 దశకంలో పాక్ లో శ్రీలంక ఆటగాళ్లపై తీవ్రవాదులు జరిపిన బాంబు దాడితో.. పాకిస్థాన్ కు రావడానికే ఇతర జట్లు భయపడుతున్నాయి. ఈ మధ్య కాలం నుంచే వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి జట్లు పాక్ లో పర్యటించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గతేడాది న్యూజిలాండ్ వచ్చినా.. వన్డే మ్యాచుకు సరిగ్గా రెండు గంటల ముందు.. భద్రతా కారణాలను చెప్పి రిటర్న్ ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. 

కాగా.. న్యూజిలాండ్ అనంతరం ఆసీస్ కూడా పర్యటన రద్దు చేసుకుంటుందని వార్తలు వచ్చినా కంగారూలు మాత్రం సిరీస్ కొనసాగడానికే మొగ్గు చూపారు. వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కాబోయే పాకిస్థాన్ పర్యటన.. ఏప్రిల్ 5 దాకా సాగనుంది. దీంతో ఐపీఎల్ ప్రారంభ దశ పోటీలకు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ఆటగాళ్లు దూరం కానున్నారు. మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్.. మే 29న ముగియనుంది. అంటే.. మార్చి లో తమ కుటుంబాలను వీడే ఆసీస్ ఆటగాళ్లు.. మళ్లీ జూన్ దాకా ఇంటికి వెళ్లే అవకాశం లేదు.