David Warner To attend  Warne Funerals:  ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ను చిన్నప్పట్నుంచి ఆరాధిస్తున్న డేవిడ్ వార్నర్.. తన అభిమాన క్రికెటర్ కు జరిగే తుది వీడ్కోలుకు కచ్చితంగా హాజరవుతానని అంటున్నాడు. దీంతో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు...

ఇటీవలే కన్నుమూసిన ప్రపంచ దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులను ఎంతగానో కలచివేసింది. ఇక అతడిని ఆరాధించే వాళ్లకైతే అది తీరని క్షోభను మిగిల్చింది. ఆ జాబితాలో ఉండే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన అభిమాన క్రికెటర్ అంత్యక్రియలకు హాజరు కావాలని కోరుకుంటున్నాడు. ఈనెల 30 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అశేష అభిమానుల మధ్య వార్న్ అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో వార్నర్ కూడా తన అభిమాన క్రికెటర్ కు తుది వీడ్కోలు చెప్పేందుకు వెళ్లనున్నాడు. ఈ మేరకు వార్నరే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 

ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వార్నర్ మాట్లాడుతూ.. ‘నేను కచ్చితంగా ఆ (వార్న్ అంత్యక్రియలకు) కార్యక్రమానికి వెళ్తా. వంద శాతం వెళ్తా. వార్న్ నా అభిమాన క్రికెటర్. చిన్నప్పట్నుంచి నేను వార్న్ కు వీరాభిమానిని. అతడి తుది వీడ్కోలు చెప్పే కార్యక్రమానికి నేను తప్పకుండా వెళ్లాలి...’ అని అన్నాడు. 

Scroll to load tweet…

పాకిస్థాన్ తో లాహోర్ లో జరుగబోయే మూడో టెస్టు (మార్చి 21 నుంచి 25 వరకు) తర్వాత తాను మెల్బోర్న్ కు వెళ్తానని వార్నర్ తెలిపాడు. మార్చి 29 నుంచి పాక్ తో మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉన్నా వార్నర్ అందులో సభ్యుడు కాదు. దీంతో మార్చి 30 న జరుగబోయే వార్న్ అంత్యక్రియలకు హాజరుకావాలని వార్నర్ నిశ్చయించుకున్నాడు. ‘వార్న్ లేడనే విషయం మాకు ఇప్పటికీ నమ్మబుద్ది కావడం లేదు. అతడు మరణించాక ప్రపంచవ్యాప్తంగా వార్న్ కు సంతాపాలు ఎలా వెళ్లువెత్తుతున్నాయో చూడండి. అతడు ఎంత మంది హృదయాలను తాకాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. చిన్నప్పుడు మా ఇంటి గోడల మీద వార్న్ ఫోటో అతికించి నేను కూడా అతడిలా కావాలని కలలు కనేవాడిని...’ అని చెప్పుకొచ్చాడు. 

మేం జోక్ అనుకున్నాం.. 

వార్న్ మరణవార్త తెలియగానే తనతో పాటు ఆసీస్ జట్టు సభ్యులంతా నమ్మలేదని, ఎవరో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని అనుకున్నామని వార్నర్ అన్నాడు. కానీ అది నిజమే అని తెలిశాక ఆ వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని తెలిపాడు. ‘ముందు ఆ వార్త తెలిసినప్పుడు మేమందా అదో జోక్ అనుకున్నాం. కానీ తర్వాత అది నిజమని తెలియగానే ఆ విషయాన్ని నమ్మడానికి ఇంకా ధైర్యం చాలడం లేదు..’అని వార్నర్ చెప్పుకొచ్చాడు. కాగా రావల్పిండిలో ముగిసిన తొలి టెస్టులో వార్నర్ తొలి ఇన్నింగ్స్ లో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. 

ఢిల్లీకి షాక్.. 

ఇదిలాఉండగా.. వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగలనుంది. వార్న్ అంత్యక్రియలు మార్చి 30 న జరుగుతాయి. అయితే ఈనెల 26 నుంచే భారత్ లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాక్ పర్యటన కారణంగా ఏప్రిల్ 6 దాకా ఆసీస్ జట్టు ఆటగాళ్లు అక్కడే ఉండాల్సి వస్తున్నది. ఆ తర్వాత వచ్చినా మళ్లీ క్వారంటైన్ అని మరో వారం రోజులు కూడా వాళ్లు బెంచ్ కే పరిమితమైతారని.. తద్వారా ఐపీఎల్ ప్రారంభ మ్యాచులు (కనీసం 3 లేదా 4) ఆసీస్ ఆటగాళ్లు లేకుండానే ఆడాల్సి వస్తుందని ఫ్రాంచైజీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఢిల్లీకి షాకింగ్ న్యూసే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ.. వార్నర్ ను రూ. 6.5 కోట్లతో దక్కించుకున్న విషయం తెలిసిందే.