Rohit Sharma Depression: టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో సారథిగా ఉన్న రోహిత్ శర్మ.. గతంలో భారత జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. నిలకడలేని ఆటతో కీలక మ్యాచులకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు స్పందిస్తూ...
డిప్రెషన్... తినడానికి రెండు పూటలా తిండి లేని నిరుపేద నుంచి రోజుకు లక్ష వరకు ఖర్చే చేసే సెలబ్రిటీల వరకు ఎదుర్కుంటున్న సమస్య. కుల, మత, వర్గ బేధాలు లేకుండా చాలామంది కుంగుబాటు (డిప్రెషన్) కు లోనై తమ జీవితాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజాలు లేడీ గాగా, డ్వేన్ జాన్సన్ నుంచి మొదలుకుని స్విమ్మింగ్ లో రికార్దు స్వర్ణాలు సాధించిన మైఖేల్ ఫెల్ఫ్స్ వరకు.. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, వరుణ్ ధావన్, నటీమణి దీపికా పదుకునే, అనుష్క శర్మ లు ఈ సమస్యను ఎదుర్కున్న వారే. భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ కూడా దీనికి బాధితుడేనట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
మహిళల క్రికెట్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి ఇటీవలే రోహిత్ శర్మ ఓ టాక్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోడ్రిగ్స్ అడిగిన ప్రశ్నలకు హిట్ మ్యాన్ సమాధానమిచ్చాడు. 2011 ప్రపంచకప్ జట్టులో రోహిత్ ఎంపిక కానప్పుడు రోహిత్ శర్మ ఎలా ఫీలయ్యాడని జెమీమా ప్రశ్నించింది.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... ‘నా క్రికెట్ కెరీర్ లో అది చాలా కఠినమైన దశ. ఎందుకంటే ఒక క్రికెటర్ కు ప్రపంచకప్ అనేది చాలా పెద్ద విషయం. ఆ లీగ్ లో ఆడి తన జట్టు విజయంలో భాగం కావాలని కోరుకుంటాడు. ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసినప్పుడు నేను దక్షిణాఫ్రికాలో ఉన్నాను. అప్పుడే నాకు విషయం (సెలెక్ట్ అవలేదని) తెలిసింది. అయితే ఈ విషయం గురించి నేను ఎవరితో మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఒంటరివాడిని అయిపోయినట్టు అనిపించింది.
ఆ సమయంలో ఒక్కడినే ఒంటరిగా కూర్చొండేవాడిని. ఎవరితో మాట్లాడకపోయేవాడిని. నెలరోజుల పాటు ఒక్కడినే కూర్చుని దిగాలుగా గడిపేవాన్ని. నేనేం తప్పు చేశానో.. నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కాలేదు. ప్రపంచకప్ కు ఆడటానికి ఇంతకంటే ఇంకేం చేయాలి..? అనుకునేవాడిని. అప్పుడు నెల రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లాను...’ అని చెప్పాడు.
నెల రోజుల పాటు కుంగుబాటుకు లోనైన రోహిత్.. తనను తానే సర్ది చెప్పుకున్నానని.. ఇంకా భాగా ఆడి తర్వాత (2015) ప్రపంచకప్ లో రాణించాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
‘2011 వన్డే ప్రపంచకప్ సమయంలో నాకు 24 ఏండ్లు ఉంటాయేమో. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో లేకున్నా ఇంకా నేను చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని అనుకున్నాను. ఈ డిప్రెషన్ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని భావించాను. జరిగిందేదో జరిగిపోయింది. అది నా చేతుల్లో లేదు. కానీ భవిష్యత్ లో భాగా రాణించేందుకు ఎలా సాధన చేయాలనేదానిపై ఫోకస్ పెట్టాను. ఆ గండం నుంచి బయటికొచ్చాను..’ అని హిట్ మ్యాన్ అన్నాడు. కాగా.. హిట్ మ్యాన్ ను ఇంటర్వ్యూ చేసిన జెమీమా రోడ్రిగ్స్ కూడా న్యూజిలాండ్ లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్ లో భారత్ జట్టులో చోటు దక్కించుకోలేదు. ఈ ట్రోఫీని బీసీసీఐ ఆమెను ఎంపిక చేయలేదు.
భారత్ ప్రపంచకప్ గెలిచిన ఆ జట్టులో హిట్ మ్యాన్ లేకపోయినా.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అతడి లైఫే మారిపోయింది. అప్పటిదాకా మిడిలార్డర్ లో వచ్చిన రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. ఆ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి ఈ ఇద్దరి కృషి మరవలేనిది. ఆ తర్వాత 2015, 2019 ప్రపంచకప్ లలో కూడా హిట్ మ్యాన్ దుమ్ము దులిపాడు. ఆ రెండు ట్రోఫీలలో భారత్ కప్ గెలవకున్నా రోహిత్ మాత్రం అదరగొట్టాడు.
