Brian Lara On MCC New Rules: క్రికెట్ చట్టాల సంరక్షకుడిగా వ్యవహరించే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఇటీవలే పలు చట్టాల్లో మార్పులు చేసింది. ఇందులో ముఖ్యంగా రనౌట్ తో పాటు  కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ కు రావడం.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్కడింగ్ ను నిషేధించడంతో పాటు క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ కు రావడం, సలైవా (బంతికి లాలాజలాన్ని పూయడం), ఫీల్డింగ్ నిబంధనల్లో మార్పులు వంటి వాటిపై ఇటీవలే ఎంసీసీ క్రికెట్ చట్టాల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే మన్కడింగ్ ను నిషేధించి దానిని కేవలం రనౌట్ గానే పిలవాలని ఎంసీసీ తెలిపింది. అయితే ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా సైతం విమర్శలు గుప్పించాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించాడు. 

బ్యాటర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉండగా బౌలింగ్ వేసే క్రమంలో అతడు పరుగు తీయడానికి క్రీజును వదలడం.. అప్పుడు బౌలర్ అక్కడున్న బెయిల్స్ ను పడగొట్టడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని లారా చెప్పాడు. నాన్ స్ట్రైక్ పొజిషన్ లో ఉన్న బ్యాటర్.. పరుగు కోసం సిద్ధంగా ఉంటాడని, ఆ సమయంలో అతడు లేదా ఆమె క్రీజును వదలడం సాధారణమే అని తెలిపాడు. 

లారా మాట్లాడుతూ.. ‘నేనిప్పటికీ దానిని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే భావిస్తున్నాను. బౌలర్ బంతిని వేసేప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్.. క్రీజును దాటడం సర్వ సాధారణం. అయితే దీనిని రనౌట్ గా పరిగణించడం మాత్రం సబబు కాదు...’ అని వ్యాఖ్యానించాడు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు మాత్రం ఎంసీసీ నిర్ణయాన్ని స్వాగతించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ తరహా ఔట్ ను గతంలో ‘మన్కడింగ్’ అనే వాళ్లు. అయితే ఎంసీసీ ఇప్పుడు ఆ పదాన్ని నిషేధించి ఆ తరహా ఔట్ ను సాధారణ రనౌట్ గానే పరిగణించాలని సూచించింది. మన్కడింగ్ పేరును నిషేధించినందుకు భారత క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే లారా మాత్రం ఏకంగా ఈ రనౌటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించడం విశేషం. 

లారానే గాక వారం రోజుల క్రితం న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఎంసీసీ కొత్త నిబంధనలపై తనదైన స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ తప్పనిసరిగా స్ట్రైకింగ్ తీసుకోవడం నిబంధన గురించి నీషమ్ స్పందిస్తూ.. ‘నాకు నిజంగా ఈ నిబంధన ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఈ నిబంధన వల్ల ఇన్నాళ్లు ఎవరికైనా ఇబ్బంది తలెత్తిందా..? ఇది నాకు నచ్చడం లేదు..’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.