టీమిండియా క్రికెటర్లను ఎప్పుడూ ప్రశంసిస్తుంటాడని తమ దేశంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ స్పందించాడు. విరాట్ కోహ్లీని ప్రశంసించడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించాడు.

కోహ్లీ వంటి ఆటగాడు ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని, అలాంటి ఆటగాడి ప్రతిభను పొగడటం తప్పెలా అవుతుందని షోయబ్ నిలదీశాడు. భారత ఆటగాళ్లు మాత్రమే కాదని, అంతర్జాతీయంగా టాలెంట్ ఉన్న ప్రతి ఆటగాడిని తాను మెచ్చుకుంటానని అక్తర్ స్పష్టం చేశాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడని.. ఇంకా అతనికి ఎంతో కెరీర్ ఉందని ఆయన చెప్పాడు. చిన్న వయసులోనే అన్ని సెంచరీలు సాధించి ప్రపంచంలోనే  మేటి క్రికెటర్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడని.. పాకిస్తాన్ మాత్రమే కాదు, ఏ దేశ క్రికెట్‌లోనూ, ఏ ఆటగాడికీ అలాంటి ఘనత లేదని అక్తర్ కొనియాడాడు.

విరాట్ లాంటి ఆటగాడు ప్రతి ఒక్కరి ప్రశంసకూ అర్హుడని, కేవలం భారతీయుడైనంత మాత్రాన కోహ్లీని అభినందించకూడదు అనడం సరికాదని షోయబ్ అక్తర్ విమర్శలకు కౌంటరిచ్చాడు. అందువల్ల తాను ఎవరు ఏమనుకున్నా సరే.. కోహ్లీని అభినందిస్తూనే ఉంటానని అక్తర్ కుండబద్ధలు కొట్టాడు.