వెస్టిండిస్ పర్యటనలో భారత జట్టు తిరుగులేని ప్రదర్శనతో విజయయాత్రను సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో అదరగొట్టిన యువ పేసర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా అదే ఊపును కరీబియన్ గడ్డపై కూడా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన ఘనతను సాధించాడు. సబీనా పార్క్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో అయితే అతడు విండీస్ బ్యాట్స్ మెన్స్ ని బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 

మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 416 పరుగులు సాధించింది. దీంతో రెండో రోజు చివర్లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ జట్టు బుమ్రా ధాటికి తట్టుకోలేకపోయింది. అతడు 9 ఓవర్లపాటు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. 9 ఓవర్లలో కూడా 3 మెయిడిన్లే వున్నాయి. ఇలా విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. 

మొదటి ఇన్నింగ్స్ లో హ్యాట్రిక్ తో అదరగొట్టిన బుమ్రాను మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేశాడు. ముందుగా బుమ్రాకు కోహ్లీ కంగ్రాట్స్ చెప్పాడు. దీనిక బుమ్రా రియాక్ట్ అవుతూ ఈ హ్యాట్రికి నీవల్లే సాధ్యమైందంటూ కోహ్లీకి థ్యాంక్స్ చెప్పాడు. ఇలా వీరిద్దరి మధ్య సరదా సంభాషణ సాగింది. 

తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా రెండో బంతికి బ్రావో.. మూడో బంతికి బ్రూక్స్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అనంతరం నాలుగో బంతికి చేజ్‌ను వికెట్ల ముందు బొల్తాకొట్టించాడు.  చేజ్ ప్యాడ్లకు బంతి తగిలినా... బంతి బ్యాట్ కు తాకిందేమోనని అనుమానంతో బుమ్రా అప్పీల్ చేయలేదు. అయితే కోహ్లీ మాత్రం బంతి ప్యాడ్‌ కు మాత్రమే తాకిందని బలంగా నమ్మి గట్టిగా అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నిరాకరించినప్పటికి కోహ్లీ సమీక్షకు వెళ్లాడు. విరాట్ అనుకున్నట్లుగానే రివ్యూలో బంతి చేజ్ ప్యాడ్‌ను తాకినట్లు తేలింది. అంతే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
 
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి 2001లో స్పిన్నర్ హార్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆ తర్వాత 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు.