IPL 2022 LSG vs RCB: ఐపీఎల్-15 ప్లేఆఫ్స్ లో భాగంగా లక్నో-బెంగళూరు మ్యాచ్ లో ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణించిన ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ పై విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఇదొకటని అన్నాడు.
లక్నో-బెంగళూరు తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్ లో రజత్ పాటిదార్ ఇన్నింగ్సే హైలైట్. మిగతా బ్యాటర్లు కనీసం నిలదొక్కుకోవడానికే ఇబ్బందులు పడుతున్న వేళ.. పాటిదార్ మాత్రం వీర విహారం చేశాడు. 49 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. ముందు కోహ్లితో ఆ తర్వాత దినేశ్ కార్తీక్ తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కాగా పాటిదార్ ఇన్నింగ్స్ పై ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. తాను ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ చూశానని, కానీ పాటిదార్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చాలా స్పెషల్ అని కొనియాడాడు.
ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘నేను నా కెరీర్ లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ చూశాను. కానీ రజత్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చాలా ప్రత్యేకం. ఒత్తిడిలో మెరుగ్గా రాణించగల ఆటగాళ్లను కూడా చూశాను. కానీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన ఇన్నింగ్స్ ఇది...
ఆర్సీబీకి కీలకమైన మ్యాచ్ లో రజత్ సెంచరీ చేశాడు. ప్లేఆఫ్స్ లో సెంచరీ చేసిన తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైనది. అతడు చేసిన సెంచరీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ఒక క్రికెటర్ గా దానిని అభినందించాలి..’ అని కోహ్లి అన్నాడు.
కాగా నిన్నటి మ్యాచ్ లో 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు పాటిదార్.. ఆది నుంచి దూకుడుగానే ఆడిన పాటిదార్.. చివరి ఐదు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రవిబిష్ణోయ్ వేసిన 16వ ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు పిండుకుని సెంచరీకి చేరువయ్యాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్ బౌలింగ్ లోనూ అదే దూకుడుతో ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇదిలాఉండగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో సెంచరీ చేసిన తొలి అన్ క్యాప్డ్ ఆటగాడు రజత్ పాటిదార్. అదీగాక ప్లేఆఫ్స్ లో శతకం బాదిన ఐదో క్రికెటర్ గా నిలిచాడు. ప్లేఆఫ్స్ లో సెంచరీలు చేసిన జాబితాను చూద్దాం.
- మురళీ విజయ్
- వీరేంద్ర సెహ్వాగ్
- వృద్ధిమాన్ సాహా
- షేన్ వాట్సన్
- రజత్ పాటిదార్
కాగా లక్నోను ఓడించిన ఆర్సీబీ.. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్ తో రెండో క్వాలిఫైయర్ లో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన విజేత.. మే 29 (ఆదివారం) న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడుతుంది. మరి ఆర్సీబీ క్వాలిఫైయర్ - 2 దాటి ఫైనల్ లో గుజరాత్ ను ఓడిస్తుందా..?
