Roger Binny: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా ఎంపికైన రోజర్ బిన్నీ దేశవాళీ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వందలాది మంది మెరుగైన ఆటగాళ్లను అందించిన రంజీ క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించాడు.
భారత క్రికెట్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ దేశ అత్యున్నత క్రికెట్ బోర్డుకు ఇటీవలే అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఎంపికైన బిన్నీ.. తాజాగా దేశవాళీ క్రికెట్, తన ఎంపిక, ఇతర విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వారధిలా పనిచేసే రంజీ క్రికెట్ అధ్వాన్నంగా తయారైందని.. దానిలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని బిన్నీ తెలిపాడు.
బీసీసీఐ అధ్యక్షుడిగా మారాక తొలిసారి కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కు వచ్చిన బిన్నీ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పలు విషయాలపై ఆయన చేసిన కామెంట్స్ ఆయన మాటల్లోనే..
బీసీసీఐ అధ్యక్ష పదవి గురించి..
నన్ను నామినేషన్ దాఖలు చేయమన్నప్పుడు షాక్ కు గురయ్యా. బీసీసీఐ ఎన్నికలలో నేను ఏదో ఒక పదవికి పోటీ చేస్తానని అనుకున్నా గానీ ఇది (బీసీసీఐ చీఫ్ పోస్ట్) ఊహించలేదు. ఇక నేను అధ్యక్షుడినని ఖరారు అయ్యాక ఆ రోజు దానికి నేను సింక్ కావడానికి రాత్రంతా ఆలోచించా.
‘అధ్యక్ష’ పదవికి భయపడ్డారా..?
లేదు. ఐదు దశాబ్దాలకు పైగా నేను క్రికెట్ లో వివిధ పాత్రల్లో ఉన్నాను. పరిపాలన అనేది నాకు కొత్తేమీ కాదు. సవాళ్లను ఇష్టపడతాను. దీనిని కూడా ఆస్వాదించబోతున్నాను. ఇది ఛాలెంజింగ్ అని నాకు తెలుసు. నా క్రికెట్ అనుభవాన్ని ఇందులో వినియోగిస్తా. మనకు ఏమి అవసరమో నాకు తెలుసు. మూడేండ్లలో నా సామర్థ్యం మేరకు పని చేసి నా తర్వాత వచ్చే వారికి పనులు చక్కబెట్టాలని నేను కోరుకుంటున్నా.
క్రికెటర్లు పాలకులుగా రాణిస్తారా..?
అవును. నేను క్రికెట్ నుంచి తప్పుకున్నాక 1998లో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చాను. అప్పుడు నేను మేనేజింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నాను. జిల్లాల్లో క్రీడలను అభివృద్ధి చేయడంలో మేం సఫలమయ్యాం. ఆటగాళ్లకు అనుకూలమైన మార్పులు తీసుకొచ్చాం. ఒక్క రంజీ మ్యాచ్ ఆడిన క్రికెటర్ కు కూడా పెన్షన్ వచ్చేలా చేశాం. ఇది మంచి మార్పే కదా.
మీరు క్రికెటర్లకు అందుబాటులో ఉంటారా..?
తప్పకుండా.. నేను టెస్టు క్రికెట్ ఆడాననో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాననో గర్వం తలకెక్కించుకోలేదు. నేను ఎప్పటికీ మారను. క్రికెటర్ల కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. గతంలో నా సాయం కోరి వచ్చిన ఏ ఆటగాడికీ నేను నో చెప్పలేదు.
దేశవాళీ క్రికెట్ ప్రస్తుత పరిస్థితిపై మీ ఆలోచనలు..
రంజీ క్రికెట్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అంతర్జాతీయ మ్యాచ్ లలో బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడటం లేదు. మేమైతే ప్రస్తుత క్రికెటర్ల మాదిరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. మా రాష్ట్రం, క్లబ్ లేదా ఓనర్ల (రైల్వేస్, సర్వీసెస్) కోసం ఆడటం గర్వంగా ఉండేది. అప్పుడే రంజీలకు వచ్చిన కొత్త క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడే అనుభవం దక్కేది. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తి లేదు. దానిని తిరిగి తీసుకురావాలి. ఆటగాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికే ఆసక్తి చూపుతున్నారు. ఇది విచారకరమైన విషయం. రంజీలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మార్గాలను కనుగొనాలి. సంప్రదాయక దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లపై దృష్టి పెట్టాలి. రెడ్ బాల్ క్రికెట్ మసకబారకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులు, క్రికెటర్ల మీద ఉంది.
