Sourav Ganguly Tweet: ఒక్క ఐడియా జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలియదు గానీ గంగూలీ చేసిన ఒక్క ట్వీట్ మాత్రం అతడికి కొద్దిసేపట్లోనో చాలా పదవులను అలంకరించేలా చేసి నానా రచ్చ చేసింది.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ రాజకీయ, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తాను క్రికెటర్ గా కెరీర్ ప్రారంభించి 30 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గంగూలీ.. వినూత్నంతో పాటు కాస్త సస్పెన్స్ ను కూడా మేళవించి చేసిన ట్వీట్ తో పలు ఛానెళ్లు అతడి రాజకీయ ఎంట్రీని కూడా ఖాయం చేశాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన దాదా మళ్లీ తానే.. బాబోయ్.. నేను చేసిన ట్వీట్ మీరనుకుంటున్నది కాదు మహాప్రభో అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మీడియాలో తన ట్వీట్ పై వచ్చిన కథనాలపై గంగూలీ తాజాగా స్పందించాడు.
ఇదే విషయమై తనను కలిసిన విలేకరులతో బుధవారం రాత్రి గంగూలీ మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచవ్యాప్తంగా ఒక ఎడ్యుకేషనల్ యాప్ తీసుకురావాలని భావిస్తున్నాను..’ అని అన్నాడు. అంతేగాక.. ‘నేను చేసిన ట్వీట్ మీద వచ్చిన వదంతులు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అదొక చిన్న ట్వీట్. అందులో నేను ఎక్కడైనా బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నానా..? లేదే..? మరేంటి రచ్చ..?’ అని తెలిపాడు.
అంతకుముందు దాదా ట్విటర్ వేదికగా.. ‘1992లో క్రికెటర్ గా కెరీర్ ను ప్రారంభించాను. క్రికెట్‌తో అనుబంధానికి ఈ ఏడాదితో 30 ఏండ్లు నిండాయి. అప్పట్నుంచి క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందగలిగాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలకు సహాయపడేలా ఇకపై ఏదైనా చేయాలని భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణంలో కూడా నాకు మద్దతు ఇస్తారని భావిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.
అయితే దాదా ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే అతడు బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాడని, రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ కొద్దిసేపటికే బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చాడు. చివరికి గంగూలీ కూడా తన ట్వీట్ మీద వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
2019 అక్టోబర్ లో బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టిన దాదా.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అందులో ఉంటాడు. ఆ తర్వాత దాదా ప్రయాణమేంటన్నదానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయడమో లేక రాజకీయాల్లోకి ప్రవేశించి బెంగాల్ లో కీలక నాయకుడిగా మారడమో చేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ కోల్కతా ప్రిన్స్ మనసులో ఏముందో...? మరి.
