Asianet News TeluguAsianet News Telugu

వాళ్లిద్దరూ టీమిండియాకు ఆడుతుండటం గర్వంగా ఉంది : మెక్‌గ్రాత్

ఆసీస్ పేస్ దిగ్గజం మెక్‌గ్రాత్  ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అకాడమీకి హెడ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ బాధ్యతలు చేపట్టి పదేండ్లు గడుస్తున్న తరుణంలో ఆయన  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

I am really proud of them: Glenn McGrath Lauds Avesh Khan and Prasidh krishna
Author
India, First Published Aug 2, 2022, 4:03 PM IST

భారత క్రికెట్‌లో కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, జహీర్ ఖాన్ వంటి వేళ్లమీద లెక్కబెట్టేగలిగే బౌలర్లు రాణించిన స్థాయిలో మిగిలిన పేసర్లు రాణించలేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తరానికి ఇద్దరు ముగ్గురు  ప్రపంచస్థాయి స్పిన్నర్లను తయారుచేస్తున్న భారత జట్టు.. పేసర్లను మాత్రం అనుకున్న స్థాయిలో అందించలేకపోయేది. కానీ గడిచిన కొద్దికాలంగా ఈ విభాగంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ పుణ్యమా అని పలువురు యువ పేసర్లు భారత జట్టుకు కూడా ఎంపికవుతున్నారు. బుమ్రా  తర్వాత మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువకులు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా టీమిండియా భవిష్యత్ ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు.  

అయితే అవేశ్ ఖాన్,  ప్రసిధ్ కృష్ణ వంటి యువ పేసర్లు భారత జట్టు తరఫున ఆడుతుండటం గర్వంగా ఉందని అంటున్నాడు ఆసీస్  మాజీ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్.  ఈ ఇద్దరూ  చెన్నైలో ఉన్న ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్  లో  శిక్షణ పొందినవారే. మెక్‌గ్రాత్  ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ అకాడమీకి హెడ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ బాధ్యతలు చేపట్టి పదేండ్లు గడుస్తున్న తరుణంలో మెక్‌గ్రాత్ ఈ యువ పేసర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

తాజాగా మెక్‌గ్రాత్ మాట్లాడుతూ.. ‘ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో ఎంఆర్ఎఫ్  ఫౌండేషన్ నుంచి  29 మంది పేసర్లు ఆడటం చూస్తేంటే గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రసిధ్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లు భారత జట్టు తరఫున ఆడుతుండటం చూస్తే గర్వంగా అనిపిస్తున్నది..’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరూ ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ లో బౌలింగ్ మెళుకువలు నేర్చుకున్నవాళ్లే కావడం గమనార్హం. ఇక వన్డే క్రికెట్ పై నడుస్తున్న చర్చపై కూడా మెక్‌గ్రాత్ స్పందించాడు.

తనకైతే టెస్ట్ క్రికెట్ తో పాటు వన్డేలంటే కూడా ఇష్టమని కానీ ప్రస్తుతం దాని భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారిందని మెక్‌గ్రాత్ అన్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లు వన్డేలు, టీ20లకు వేర్వేరు జట్లను కలిగిఉన్నాయని, డబ్బు కారణంగానే టీ20లకు మళ్లుతున్నారనేదానిపై కూడా కచ్చితంగా సమాధానం చెప్పలేమని మెక్‌గ్రాత్ చెప్పాడు.  

‘ఆటగాళ్లకు సరైన పరీక్ష టెస్టు క్రికెట్ లోనే ఎదురవుతుంది. నాకైతే సంప్రదాయ టెస్టు క్రికెట్ అంటేనే ఇష్టం. టెస్టులతో పాటు వన్డేలంటే కూడా ఇష్టమే. ఇప్పటికీ నా దృష్టిలో టెస్టులే అత్యుత్తమం. ఇదే క్రికెటర్లలోని ఆటను కాపాడుతుందని నేను బలంగా నమ్ముతా. ఇక వన్డేల సంగతికొస్తే..  పరుగులు చేస్తున్నంతకాలం ఆ ఫార్మాట్ కూడా మనగలుగుతుంది. కానీ వన్డేల భవిష్యత్ ఏంటనేది కాస్త ఆసక్తిగా ఉంది. టీ20లు,టెస్టుల మాదిరిగానే వన్డేలనూ ప్రోత్సహించాల్సిన అవసరముంది..’ అని మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios