టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పగానే ఎవరైనా మిస్టర్ కూల్ అని అనేస్తారు. ఎందుకంటే.... ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధోనీ ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడూ కోపం ప్రదర్శించినట్లు కూడా కనిపించడం. అందుకే అతనిని అందరూ మిస్టర్ కూల్ అంటారు. అయితే... తాను అందరిలాంటి వాడినే అని.. తనకు కూడా కోపం వస్తుంది అంటున్నాడు ధోనీ.

గత జూలైలో ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ..తొలిసారి బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు. ‘నాకూ అసహనం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కోపం కూడా వస్తుంది. నిరాశకు లోనవుతా. అయితే ఇవీ ఏవీకూడా నాలో ఎక్కువసేపు ఉండవు’ అని వివరించాడు. 

సమస్య ఎదురైనప్పుడు హైరానాపడిపోకుండా దానికి పరిష్కారాలు వెతకడం ముఖ్యమని అన్నాడు. ‘మైదానంలో సమస్య ఎదురైతే గాభరా పడిపోను. తదుపరి ఎలాంటి వ్యూహం ఆచరిస్తామన్నది ముఖ్యం. ఏ ఆటగాడిని ఉపయోగిస్తే ఆ సమస్యనుంచి బయటపడగలమో ఆలోచిస్తా. అలా చేయడం ద్వారా నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటా’ అని  ధోనీ పేర్కొన్నాడు. 

ఏదైనా ఒక పని తుది ఫలితం ఎలా ఉంటుందోనని తర్జనభర్జన పడేకంటే.. ఆ పని చేసే విధానం గురించి ముందు ఆలోచించాలని చెప్పాడు. కెప్టెన్‌గా తాను ఇదే సూత్రాన్ని పాటించానన్నాడు. ‘టెస్ట్‌ మ్యాచ్‌ అయితే తదుపరి ఎత్తు గురించి ఆలోచించేందుకు సమయముంటుంది. టీ20లలో అయితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నాడు. జట్టు లక్ష్యాలను చేరుకోవడమే అన్నింటికంటే ముఖ్యమని ధోనీ చెప్పుకొచ్చాడు.