Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా  టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పలు విషయాలపై స్పష్టతనిచ్చాడు.  కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో తాను ఆడతానని చెప్పాడు. 

భారత క్రికెట్ జట్టులో తీవ్ర చర్చకు దారి తీసిన వన్డే కెప్టెన్సీ వ్యవహారంపై టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొద్దిరోజులుగా ఈ వ్యవహారంపై రోజుకో వార్త వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. బయట వినిపిస్తున్నట్టు.. దక్షిణాఫ్రికా లో జరుగబోయే వన్డే సిరీస్ కు తాను విశ్రాంతిని కోరలేదని కోహ్లీ అన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆడటానికి వేచి చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టెస్టు జట్టును ఎంపిక చేయడానికంటే గంటన్నర ముందు తనకు ఈ విషయం గురించి తెలిసిందని తెలిపాడు.

కోహ్లీ మాట్లాడుతూ.. ‘సౌతాఫ్రికా తో టెస్టు సిరీస్ కు గంటన్నర ముందే నాకు ఈ విషయం తెలిసింది. చీఫ్ సెలెక్టర్ నాతో టెస్టు జట్టు సభ్యుల ఎంపిక గురించి మాట్లాడి .. చివర్లో ఈ విషయం చెప్పాడు. ఐదుగురు సెలెక్టర్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, నువ్వు ఇక వన్డే కెప్టెన్ గా ఉండబోవని తెలిపాడు. అంతకంటే ఎక్కువ తాను చెప్పలేనని ఫోన్ కట్ చేశాడు...’ అని చెప్పాడు. 

నాకొచ్చిన నష్టమేమీ లేదు.. 

Scroll to load tweet…

అయితే కెప్టెన్సీ నుంచి తీసేసినంత మాత్రానా తనకు నష్టమేమీ లేదని, ఇంకా ఆటగాడిగా మెరుగ్గా రాణించడానికి తనకు మంచి అవకాశం దొరికిందని కోహ్లీ చెప్పాడు. అయితే ఈ విషయంలో కనీసం తనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడంపై విరాట్ అసహనం వ్యక్తం చేశాడు. ‘బీసీసీఐ నన్ను కెప్టెన్ గా తొలగిస్తున్నట్టు మాత్రమే చెప్పింది. కానీ దీనిపై నాకు కనీస సమాచారం కూడా లేదు. కెప్టెన్సీ పోయినంత మాత్రానా నాకు పోయేదేమీ లేదు. ఆటగాడిగా ఇంకా భాగా రాణించడానికి అవకాశం దొరికింది..’ అని చెప్పాడు. 

అది విప్లవాత్మక మార్పు..

‘టీ20 సారథ్య బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని భావించినప్పుడు ముందుగా బీసీసీఐ అధికారులకు సమాచారం ఇచ్చాను. వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. నా కెరీర్లో దానిని ఓ విప్లవాత్మకమైన మార్పుగా భావించాను. వన్డేలకు, టెస్టులకు మాత్రం కెప్టెన్ గా కొనసాగుతానని బీసీసీఐకి చెప్పాను..’ అని కోహ్లీ తెలిపాడు. 

అవన్నీ పుకార్లే.. 

ఇక రోహిత్ శర్మ సారథ్యంలో ఆడటం ఇష్టం లేక తాను వన్డే సిరీస్ కోసం రెస్ట్ అడిగానని వస్తున్న వార్తలపై కూడా విరాట్ స్పష్టతనిచ్చాడు. అసలు తాను ఎవరినీ విశ్రాంతి కావాలని సంప్రదించలేదని తెలిపాడు. ఇప్పటివరకు వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని చెప్పాడు. 

‘నేను సౌతాఫ్రికా టూర్ కు అందుబాటులో ఉంటా. నాకు విశ్రాంతి కావాలని నేనెప్పుడూ కోరలేదు. మీడియాలో వచ్చే వార్తలు నమ్మశక్యంగా లేవు. నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించామని మాత్రమే నాకు సెలెక్టర్లు చెప్పారు. అంతేగానీ వన్డేల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్టు నేను ఎక్కడా చెప్పలేదు. వన్డేలకు నేను అందుబాటులో ఉంటానని మరోసారి స్పష్టంగా చెబుతున్నా..’ అని అన్నాడు.

వాళ్లనే అడగండి.. 

రోహిత్ కెప్టెన్సీ లో ఆడటం ఇష్టంలేకే తాను వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నానని వచ్చిన వార్తలపై కోహ్లీ ఫైర్ అయ్యాడు. అలాంటి వాటికి తాను సమాధానం చెప్పనని, వారినే అడగండి అని అన్నాడు.‘ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఆపండి. ఒకవేళ మీకు క్లారిటీ కావాలనుకుంటే ఆ వార్తలు రాసిన వారిని వెళ్లి అడగండి..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

రోహిత్ శర్మ గురించి.. 

‘రోహిత్ చాలా సమర్థుడైన కెప్టెన్. వ్యూహాత్మకంగా చాలా సమర్థవంతంగా ఉంటాడు. రెండు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నా. ఇక నేను అలసిపోయాను. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ సారథ్యంలో.. రాహుల్ భాయ్ (కోచ్ రాహుల్ ద్రావిడ్) ల మార్గదర్శకంలో పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వారికి నా వంద శాతం మద్దతు లభిస్తుంది..’ అని స్పష్టం చేశాడు. ఇక తన చర్యలు గానీ, నిర్ణయాలు గానీ జట్ట స్థాయిని దించేలా ఉండవని స్పష్టం చేశాడు కోహ్లీ.