కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాదు అద్భుతమైన విజయాన్ని సాధించింది. కోల్ కతా తమ ముందు ఉంచిన 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో దూకుడుకు కోల్ కతా నైట్ రైడర్స్ చెత్త ఫీల్డింగ్ కూడా తోడై సన్ రైజర్స్ హైదరాబాదుకు విజయాన్ని చేకూర్చి పెట్టింది. ఫీల్డర్స్ కనీసం మూడు సులభమైన క్యాచులు వదిలేయడంతో కోల్ కతా బౌలర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

హైదరాబాద్ ఓపెనర్ బెయిర్ స్టో 43 బంతుల్లో 4 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియమ్సన్ 9 బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో బ్యాటింగ్ ముందు పూర్తిగా తేలిపోయారు. 

కోల్ కతా నైట్ రైడర్స్ తమ ముందు ఉంచిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఒకరితో ఒకరు పోటీ పడుతూ పరుగులు సాధించారు. ఇద్దరు కూడా అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో ఐదు సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసి పృథ్వీరాజ్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి హైదరాబాద్ 12.2 ఓవర్లలో 131 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్లలో క్రిస్ లీన్ 51, రింకు సింగ్ 30 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, భువనేశ్వర్ కుమార్ 2, సందీప్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. 

విధ్వంసక ఆటగాడు అండ్రీ రస్సెల్‌ను భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించాడు. అంతకు ముందు కేవలం 9 బంతుల్లో రెండు సిక్సర్లతో రస్సెల్ విరుచుకుపడ్డాడు.నైట్ రైడర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ తర్వాత ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్రిస్ లిన్ ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడిన క్రిస్.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ స్కోరును పెంచాడు.  ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి ఐపీఎల్‌లో తొమ్మిదవ అర్థ సెంచరీ. 46 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో క్రిస్ లిన్ అర్ధసెంచరీ నమోదు చేశాడు.

కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్న రింకు సింగ్-క్రిస్ లిన్ జోడీని సందీప్ శర్మ విడదీశాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రింకు పెవిలియన్ చేరాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ రనౌట్‌గా వెనుదిరగడంతో కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. నైట్‌రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. నితీశ్ రానా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ కోల్‌కతా స్కోరు బోర్డు మాత్రం పరుగులు తీస్తోంది.

స్వల్ప పరుగుల వ్యవధిలోనే  ఖలీల్ అహ్మద్ నైట్ రైడర్స్‌ను మరో దెబ్బ తీశాడు. స్టార్ ఆటగాడు శుభమన్ గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దూకుడుగా ఆడిన ఓపెనర్ సునీల్ నరైన్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కేవలం 8 బంతుల్లోనే నరైన్ 2 సిక్సులు, 3 ఫోర్లతో 25 పరుగులు చేశాడు.ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.