Asianet News TeluguAsianet News Telugu

‘హైదరాబాద్ సికింద్రాబాద్ సిరాజ్ భాయ్ జిందాబాద్..’ కొత్త స్లోగన్ తో మియా ఫ్యాన్స్ రచ్చ

INDvsNZ: టీమిండియా యువ పేసర్,  హైదారాబాదీ  కుర్రాడు మహ్మద్ సిరాజ్ గత ఏడాదిన్నర కాలంగా వన్డేలలో   రాటుదేలుతున్నాడు. భారత్ కు బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. 

Hyderabad Sikanderabad, Siraj bhai jindabad: Fans Praising Hyderabadi Pacer MSV
Author
First Published Jan 22, 2023, 11:50 AM IST

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన పేసర్ గా ఉన్న  జస్ప్రీత్ బుమ్రా   గత కొంతకాలంగా గాయాలతో సావాసం చేస్తున్న  నేపథ్యంలో అతడు లేని లోటును  తీర్చడానికి తానున్నానని దూసుకొచ్చాడు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్. గతంలో టెస్టులకు  మాత్రమే పరిమితమైన మియా (సిరాజ్ ముద్దు పేరు).. ఇప్పుడు వన్డేలలోనూ  రెగ్యులర్ బౌలర్ గా మారాడు.  ఏడాదికాలంగా తన లైన్ అండ్ లెంగ్త్, బౌలింగ్ లో  స్వల్ప మార్పులతో  సంచలన ప్రదర్శనలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ తో పాటు తాజాగా న్యూజిలాండ్ తో కూడా  అదరగొడుతున్నాడు.   

2017 నుంచి  భారత్ కు ఆడుతున్నా సిరాజ్ తన సొంతగడ్డపై  ఇటీవలే తొలి  అంతర్జాతీయ   మ్యాచ్ ఆడాడు.  ఉప్పల్ లో  భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు   నాలుగు కీలక వికెట్లు తీసి  టీమిండియా విజయాల్లో  కీలక భూమిక పోషించాడు.   అయితే ఈ వన్డేలో  సిరాజ్ ప్రదర్శన చూడటానికి లోకల్ ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియానికి పోటెత్తారు. 

అంతర్జాతీయ స్థాయిలో  మెరుగైన బౌలర్ గా ఎదుగుతుండటంతో  సిరాజ్ కు ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ జరుగుతుండగా  పలువురు అతడి అభిమానులు.. ‘సిరాజ్ భాయ్.. సిరాజ్ భాయ్..’ అని అరిచారు.  ఓ అభిమాని అయితే.. ‘హైదరాబాద్ సికింద్రాబాద్.. మా సిరాజ్ భాయ్ జిందాబాద్..’అని స్లోగన్ అందుకున్నాడు.   సిరాజ్  వికెట్ తీసినప్పుడల్లా ఈ స్లోగన్  వినిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

 

ఇటీవలే ముగిసిన శ్రీలంకతో సిరీస్ లో  మూడు వన్డేలలో 9 వికెట్లతో చెలరేగిన  సిరాజ్...  న్యూజిలాండ్ తో తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టాడు. రాయ్‌పూర్ లో కూడా  ఒక వికెట్ దక్కించుకున్నాడు.  ఈ మ్యాచ్ ను సిరాజ్ కుటుంబసభ్యులు  ఉప్పల్ కు వచ్చి వీక్షించారు.

కాగా  మ్యాచ్ కు ముందు సిరాజ్ తల్లి, స్నేహితులు అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఓ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో షేర్  చేసింది. ఈ సందర్భంగా సిరాజ్ తల్లి మాట్లాడుతూ.. ‘నేను  అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా  సిరాజ్  ఇలాంటి మంచి ప్రదర్శనలు చేయాలని కోరుకుంటున్నా. నిలకడగా ఆడి  వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకుంటాడని నేను భావిస్తున్నా..’  అని తెలిపింది. 

ఇక లంకతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. కివీస్ తో కూడా  వన్డే సిరీస్ ను గెలుచుకుంది. మూడు  మ్యాచ్ లలో భాగంగా హైదరాబాద్, రాయ్‌పూర్ వన్డేలను భారత్ నెగ్గింది. నామమాత్రపు  మూడో వన్డే ఈనెల 24న ఇండోర్ లో జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios