భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుబంధ సంఘాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఇవాళ(శుక్రవారం) ఎన్నికలు ముగిశాయి. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2గంటలవరకు జరిగింది. హెచ్‌సీఎ ఎన్నికల్లో ఓటుహక్కును కలిగివున్న వారందరు ఉత్సాహంగా ఓటేయడానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియానికి తరలివచ్చారు. 

వివిధ పదవుల కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొదట 62 మంది నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గుడువునాటికి చివరిపోటీలో 17 మంది నిలిచారు. వారందరి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయ్యింది. సాయంత్రం 5గంటలకు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

హెచ్‌సీఎ అధ్యక్ష పదవికి మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దిన్ తో పాటు దీలిప్ కుమార్,  ప్రకాష్‌చంద్ జైన్‌ లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పొటీకి అనర్హుడిగా నిలిచిన అజారుద్దిన్ కు ఈ ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేవు. అతడే అధ్యక్ష రేసులో హాట్ ఫేవరెట్ గా  వున్నాడు. 

హెచ్‌సీఏ లో దాదాపు 230 మంది ఓటుహక్కును కలిగివుండగా ఈ ఎన్నికల్లో 223 మంది ఓటేసినట్లు సమాచారం. వారిలో వివిఎస్ లక్ష్మణ్,  శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, అర్షద్ ఆయుబ్, నోయెల్ డేవిడ్, రజని వేణుగోపాల్, పూర్ణిమా రావ్, దయానంద్ డేవిడ్ వంటి సెలబ్రెటీలున్నారు. వీరందరు  కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి కనబర్చారు.

హెచ్‌సీఎ ఎన్నికల నామినేషన్ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ అధ్యక్షులు జి. వివేక్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు  సిద్దపడగా నామినేషన్ తిరస్కరించబడింది. లోధా కమిటీ సిపార్సులను అనుసరించే అతన్ని ఈ ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారి వీ.ఎస్.సంపత్ వెల్లడించారు. దీంతో ప్రకాష్‌చంద్ జైన్‌ ప్యానెల్ కు మద్దతు ప్రకటించారు.