విరాట్ కోహ్లీ... ఈ పేరు  వింటేనే ప్రత్యర్థి ఆటగాళ్లు భయపడిపోతుంటారు. అతన్ని ఔట్ చేయగలిగితే చాలు ఈజీగా గెలుపొందొచ్చని భావిస్తుంటారు. ఒక్కసారి కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడంటే భారీ స్కోరు సాధించేవరకు వదలడని  వారికి తెలుసు. ప్రత్యర్థి బౌలర్లను అస్సలు ఛాయిస్ ఇవ్వకుండా కేవలం వికెట్ల మధ్య పరుగెడుతూ పరుగులు రాబట్టడంలో కోహ్లీ దిట్ట. కానీ ఇలా భారీ షాట్లు ఆడకుండా భారీ స్కోరు సాధించడమంటే మామూలు విషయం కాదు. కానీ కోహ్లీకది చాలా మామూలు విషయమే. ఎందుకంటే అతడి పిట్ నెస్ అలాంటిది. 

టీమిండియాకు ఫిట్ నెస్ అనే పదానికి అర్థమేంటో చెప్పింది కోహ్లీయే అనడంలో ఎలాంటి అతిశయోక్తి వుండదు. కోహ్లీ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో సమస్యలను అదిగమించి మంచి క్రికెటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ పేరును కొన్నేళ్లుగా కాపాడుకుంటూ ఇంకా అత్యుత్తమ క్రికెటర్ గా మారడానికి ఎంత కష్టపడాల్సి  వచ్చిందో కోహ్లీ  తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. 

''నేను అందరు ఆటగాళ్లలో ఒకడిగా వుండాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వుండాలని అనునిత్యం తాపత్రయపడేవాడిని. అందుకోసం నేను ఎంచుకున్న మార్గం ఫిట్ నెస్. మనిషి ఫిట్ గా వుంటేనే దేన్నయినా సాధించగలడు. కాబట్టి దానిపై దృష్టిపెడితే ఆటోమెటిగ్గా నా ప్రదర్శన దానంతట అదే మారుతుందని అనుకున్నా. నేను అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. 

తొలినాళ్లలో నన్ను చూసి ఎవరూ భయపడేవారు. కనీసం బ్యాట్స్ మెన్ గా అయినా కనీస గౌరవాన్ని ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు నాకు గౌరవమిస్తూ నా  ఆంటంటే భయపడిపోతున్నారు. ఎక్కడ నేను వారి విజయావకాశాలను దెబ్బతీస్తానో అని భయపడితే... మంచి ఆటతీరు కలిగిన ఆటగాడని గౌరవిస్తున్నారు. నేను ఇదే కావాలని కోరుకున్నాను. నేను ఫిట్ గా వుండి అత్యుత్తమంగా ఆడటం వల్లే ఇది సాధ్యమయ్యింది.'' అని కోహ్లీ వెల్లడించాడు.   

గతంలో కూడా ఓసారి కోహ్లీ తన ఫిట్ నెస్ రహస్యాన్ని వెల్లడించాడు. 2012 ఆస్ట్రేలియాతో సీరిస్ కు ముందు తాను అసలు ఫిట్ నెస్ గురించే పట్టించుకునేవాడిని కాదని కోహ్లీ తెలిపాడు. కానీ శరీరం సహకరిస్తేనే మనలోని అత్యుత్తమ క్రీడాకారుడు బయటకు వస్తాడనే  నిజాన్ని తెలుసుకుని ఫిట్ నెస్ పై దృష్టి సారించానని కోహ్లీ తెలిపాడు.