కరాచీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ వ్యాధిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చైనీయులను నిందించారు. కరోనావైరస్ వ్యాప్తిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు రద్దయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను కదించారు. ఐపిఎల్ రద్దయింది. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీసీఎల్) లాహోర్ మ్యాచును, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచులను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచుకు ప్రేక్షకులు కరువయ్యారు. ఖాళీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది.

పీఎస్ఎల్ వల్ల తనకు తీవ్రమైన కోపం వస్తోందని, చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయని, దేశంలో పీఎస్ఎల్ జరుగుతోదని, అది రిస్క్ లో పడిందని, విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోతున్నారని, మిగతా మ్యాచులు ప్రేక్షకులు లేకుండా జరగబోతున్నాయని ఆయన అన్నారు. 

కరోనా వ్యాపించిన నేపథ్యంలో చైనా ఆహారపు అలవాట్లపై షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డారు. వారి ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా వైరస్ వచ్చి ప్రపంచం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. 

చైనీయులు గబ్బిలాల వంటివాటిని ఎందుకు తింటారో, వాటి రక్తం, మూత్రం ఎలా తాగుతారో తనకు అర్థం కావడం లేదని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వైరస్ ను వ్యాపింపజేస్తున్నారని, తాను చైనా ప్రజల గురించి మాట్లాడుతున్నానని, ప్రపంచాన్ని వారు ప్రమాదంలో పడేశారని ఆయన అన్నారు. 

వారు గబ్బిలాలను, క్కుకలను, పిల్లులను ఎలా తింటారో తనకు నిజంగా అర్థం కావడం లేదని, తనకు నిజంగా కోపం వస్తోందని అక్తర్ అన్నారు. ప్రపంపమంతా సంక్షోభంలో పడిందని, పర్యాటర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం పడిందని, ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందని ఆయన అన్నారు. 

తనకు చైనా ప్రజలపై కోపం లేదని, జంతు ప్రవృత్తికి తాను వ్యతిరేకమని ఆయన అన్నారు. అది చైనా ప్రజల సంస్కృతి కావచ్చు గానీ అది చైనాకు ఉపయోగపడడం లేదని, మానవత్వాన్ని చంపేస్తోందని ఆయన అన్నారు. చైనీయులను బాయ్ కాట్ చేయాలని తాను అనడం లేదని, ఏదో ఒక్క నియమం ఉండాలని, ప్రతిదాన్నీ తినకూడదని ఆయన అన్నారు.