యువరాజ్ సింగ్... ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్. భారత జట్టులో అవకాశాల కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన యువీ, 2019లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా సచిన్‌ టెండూల్కర్ నాయకత్వంలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడిన యువరాజ్, పాత యువీని మరోసారి అభిమానులకు పరిచయం చేశాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసిన యువీకి హోటెల్ సిబ్బంది వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ‘బాహుబలిలో సాహోరే బాహుబలి పాటను పెట్టి... గరిటెలు, వంటసామాగ్రిని పైకి లేపి అటు ఇటూ నిలబడి స్వాగతం పలికారు. ఈ గ్రాండ్ వెల్‌కమ్‌కి ముగ్ధుడైన యువీ, డ్యాన్స్ చేస్తూ హోటెల్‌కి వెళ్లాడు.