Asia Cup 2022: ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సి ఉన్న ఆసియా కప్ నిర్వహణ పై శ్రీలంక మల్లగుల్లాలు పడుతున్నది.   తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఈ సిరీస్ నిర్వహణ అత్యంత ఆవశ్యకం. 

దేశంలో నెలకొన్ని ఆర్థిక సంక్షోభాలతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆసియా కప్ నిర్వహణ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం శ్రీలంక లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో అక్కడ ఇంత పెద్ద టోర్నీ నిర్వహణ ఎలా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్భణంలో కూరుకుపోయి.. నిత్యావసర వస్తువులకు కూడా జనాలు అల్లాడుతున్న తరుణంలో శ్రీలంక ఈ టోర్నీని నిర్వహించడం కత్తిమీద సామే. అయినా కూడా శ్రీలంక మాత్రం టోర్నీని తమ దగ్గరే నిర్వహించాలని కోరుతున్నది. 

ఇదే విషయమై ఎస్ఎల్సీ సెక్రెటరీ మోహన్ డిసిల్వ ఇన్సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ... ‘ఆసియా కప్ నిర్వహణ పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి మేం ఆస్ట్రేలియా సిరీస్ ను ఎలా నిర్వహిస్తామన్నది మా ముందున్న అతి పెద్ద సవాల్.. ఈ సిరీస్ సజావుగా సాగితే ఆసియా కప్ కూడా లంకలోనే ఉంటుంది’ అని తెలిపాడు. 

ఆసియా కప్ నిర్వహణ విషయమై మోహన్ తో పాటు ఇతర ఎస్ఎల్సీ అధికారులు ఇటీవలే బీసీసీఐ సెక్రెటరీ జై షాతో పాటు ఆసియా కప్ క్రికెట్ (ఏసీసీ) అధికారులను కలిశారు. ఆసియా కప్ ను లంకలోనే నిర్వహించాలని, అందుకు గల కారణాలను కూడా వారికి వివరించారు. 
‘ఆస్ట్రేలియా సిరీస్ నిర్వహణ పై లంకలో ఆసియా కప్ ను నిర్వహిస్తామా..? లేదా..? అన్నది తేలుతుంది. జై షా తో పాటు ఏసీసీ అధికారులు కూడా మాకు ఇదే విషయాన్ని చెప్పారు. అంతా సవ్యంగా ఉంటే లంకలోనే ఆసియా కప్ ను నిర్వహిస్తామని వాళ్లు మాకు హామీ ఇచ్చారు..’ అని మోహన్ చెప్పాడు. శ్రీలంక-ఆస్ట్రేలియాల మధ్య సిరీస్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానుంది. 

ఆసియా కప్ నిర్వహిస్తే లంకకు వచ్చే లాభాలేంటి..? 

- ఇండియా-పాకిస్తాన్ వంటి అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచుల నిర్వహణ వల్ల టికెట్లు, ఇతరత్రా రూపంలో ఆదాయం వస్తుంది. 
- ఆతిథ్య బోర్డు కు హోస్టింగ్ ఫీజులు దక్కుతాయి. 
- టికెట్ల అమ్మకాల మీద వచ్చిన ఆదాయం ఆతిథ్య బోర్డుకే.. 
- స్థానికంగా ఉండే స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం. 

నిర్వహించడానికి కష్టాలు : 

- ప్రస్తుతం లంకలో తీవ్ర విద్యుత్ కోత ఉంది. నగారాల్లో కూడా రోజుకు కనీసం 18 గంటలు అధికారిక కోతలే ఉన్నాయి. పల్లెటూర్లయితే దాదాపు అంధకారంలోనే మగ్గుతున్నాయి. మరి క్రికెట్ మ్యాచ్ అంటే దానికి నానా హంగామా ఉంటుంది. ముఖ్యంగా డే అండ్ నైట్ మ్యాచ్ లంటే కరెంట్ అవసరం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో అంత విద్యుత్ ను భరించే స్థితిలో కూడా ఎస్ఎల్సీ లేదు. 
- పోనీ జనరేటర్ ల ద్వారా అయినా డే అండ్ నైట్ మ్యాచులను నిర్వహిద్దామంటే ఆ అవకాశం లేదు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేవు. విదేశీ మారకద్రవ్యం నిల్వలు కూడా అడుగంటాయి.

ఏదేమైనా శ్రీలంక - ఆస్ట్రేలియా సిరీస్ నిర్వహణ అనేది ఎస్ఎల్సీ ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సిరీస్ సజావుగా సాగితేనే ఆసియా కప్ కు ఆతిథ్యం దక్కుతుంది. అలా కాకుండా ఏదైనా తేడాలు వస్తే అంతే ఇక..