Asianet News TeluguAsianet News Telugu

భారత్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్.. హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసింది..

Hockey World Cup 2023: కోట్లాది అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ  భారత హాకీ జట్టు మరోసారి నిరాశపరిచింది.  క్రాస్ ఓవర్ మ్యాచ్ లో  భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడి   ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. 
 

Heartbreak For India, New Zealand Thrashes Out  Indian Team in Men's Hockey World Cup, Moves to Quarters MSV
Author
First Published Jan 23, 2023, 10:28 AM IST

క్రికెట్‌ ప్రపంచకప్‌లలో భారత్ కు కొరకరాని కొయ్యగా  మారే  న్యూజిలాండ్.. ఇప్పుడు హాకీలో కూడా అడ్డుగా మారింది.  భువనేశ్వర్ వేదికగా  జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్ లో  న్యూజిలాండ్  పెనాల్టీ షూటౌట్‌లో 5-4 (3-3) తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో 48 ఏండ్లుగా  ప్రపంచకప్  కోసం ఎదురుచూస్తున్న భారత హాకీ అభిమానులను మరో నాలుగేండ్లపాటు వేచి చూడక  తప్పదు. స్వదేశంలో భారత్ కు ఇది  వరుసగా రెండో ప్రపంచకప్ ఓటమి.  

క్వార్టర్స్ పోరులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ మెరుగ్గానే ఆరంభించింది.   రెండు క్వార్టర్స్ లో మనదే పై చేయి.  భారత్ తరఫున  17వ నిమిషంలోనే  లలిత్ ఉపాధ్యాయ్  తొలి గోల్ కొట్టాడు.   24వ నిమిషంలో  సుఖ్‌జీత్ సింగ్ రెండో గోల్ చేశాడు. 

రెండు క్వార్టర్స్ లో భారత్ దే ఆధిపత్యం.  ఫలితంగా భారత్ 2-0 తేడాతో  ఆధిక్యంలో నిలిచింది.  తర్వాత న్యూజిలాండ్ పుంజుకుంది.  సామ్ లేన్.. 28వ నిమిషంలో గోల్ చేశాడు. భారత డిఫెన్స్ ను ఛేదించుకుంటూ  అతడు చేసిన గోల్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.  ఆ తర్వాత భారత్ తరఫున 40వ నిమిషంలో   మరో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1 కి పెంచాడు.  కానీ  ఆట చివర్లో  కివీస్ పుంజుకుంది.  43వ నిమిషంలో కేన్ రసెల్..  49వ నిమిషంలో  సీన్ ఫిండ్లే  లు  తలో గోల్ చేశారు.  ఫలితంగా మ్యాచ్ టై అయి పెనాల్టీ షూటౌట్ కు వెళ్లింది.

పెనాల్టీ షూటౌట్ లో.. 

నిర్ణీత సమయంలో  ప్రత్యర్థి తప్పిదాలతో భారత్ కు లభించిన పెనాల్టీ షూటౌట్‌లను  సద్వినియోగం చేసుకోలేకపోయిన టీమిండియా..  చివర్లో కూడా ఇదే తప్పిదంతో   మూల్యాన్ని చెల్లించుకుంది.  షూటౌట్ లో భారత్ తరఫున తొలి రెండు ప్రయత్నాల్లో  హర్మన్‌ప్రీత్, రాజ్‌కుమార్ గోల్స్ చేశారు. కివీస్ తరఫున  నిక్ వుడ్స్, సీన్  కూడా  గోల్స్  సాధించారు. ఫలితంగా స్కోరు 2-2 తో సమంగా నిలిచింది.  తర్వాత కివీస్  ఆటగాడు ఫిలిప్స్ గోల్ చేశాడు. సుఖ్‌జీత్ దానిని సమం చేశాడు. అనంతరం  షంషేర్, సామ్ లేన్ గోల్స్ చేయలేదు.  సీన్ గోల్ తో  కివీస్ ఆధిక్యం  4-3కు వెళ్లింది. ఆ క్రమంలో రాజ్‌కుమార్ గోల్ చేయడంతో స్కోర్లు లెవల్ అయ్యాయి. చివర్లో  సామ్ గోల్ తో కివీస్ ఆధిక్యం (5-4) లోకి వెళ్లింది. తీవ్ర ఉత్కంఠ నడుమ  వచ్చిన షంషేర్ గోల్ చేయడంలో విఫలమయ్యాడు.  దీంతో భారత్ అభిమానులకు గుండెకోత మిగిలింది.  ఇక  భారత్ ను ఓడించిన న్యూజిలాండ్.. క్వార్టర్స్ లో బెల్జియంతో  తలపడనుంది. 

 

మరో నాలుగేండ్లు ఆగాల్సిందే..

భారత్ చివరిసారి   1975లో ప్రపంచకప్ గెలిచింది. అప్పట్నుంచి ప్రస్తుత టోర్నీ వరకూ భారత్ కు షాకులు తాకుతూనే ఉన్నాయి.  2021లో ఒలింపిక్ పతకం, కామన్వెల్త్ క్రీడల్లో రజతం.. ఇలా సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ ఈసారి తప్పకుండా  విశ్వవిజేతగా అవతరిస్తుందని అనుకున్నారంతా. అదీగాక స్వదేశంలో భారత్ కు కలిసొస్తుందని భావించినా  టీమిండియా మాత్రం క్వార్టర్స్ కు   చేరలేకపోయింది. ఈ ఓటమితో  భారత్  ప్రపంచకప్ వేట కోసం మరో నాలుగేండ్లు (2027) వేచి చూడాల్సిందే.. 

Follow Us:
Download App:
  • android
  • ios