Asianet News TeluguAsianet News Telugu

ఇక చాలులే కుల్దీప్.. నువ్వెలాగూ నెక్స్ట్ మ్యాచ్‌లో డ్రాప్ అవుతావు.. ఎందుకీ ఆరాటం..?

INDvsSL: భారత్ - శ్రీలంక మధ్య ముగిసిన రెండో వన్డేలో  పర్యాటక జట్టు మిడిలార్డర్ ను పడగొట్టడంంలో  టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దే కీలక పాత్ర. ఈ మ్యాచ్ లో కుల్దీప్ మూడు వికెట్లు తీశాడు. 

He Pushes Him Closer to Getting Dropped For The next Match : Netizens Reacts After  Kuldeep yadav Show in Eden Gardens
Author
First Published Jan 13, 2023, 10:08 AM IST

ఇండియా-శ్రీలంక మధ్య  గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన  రెండో వన్డేలో భారత్  పోరాడి గెలిచింది.  ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే ఉన్నా భారత్ టాపార్డర్ తడబడటంతో  వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే  టీమిండియా వికెట్ కీపర్  కెఎల్ రాహుల్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాలు జట్టును ఆదుకుని భారత్ ను విజయతీరాల వైపునకు నడిపించారు.  కాగా ఈ మ్యాచ్ లో  శ్రీలంక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.  ఓపెనర్లతో పాటు  మూడో స్థానంలో వచ్చిన కుశాల్ మెండిస్ కూడా రాణించడంతో ఒకదశలో లంక పటిష్టమైన స్థితిలో నిలిచింది.  కానీ  టీమిండియా సారథి రోహిత్ శర్మ.. కుల్దీప్ కు బంతినివ్వడంతో అంతా తలకిందులైంది. 

తను వేసిన తొలి ఓవర్లోనే  లంక బ్యాటర్ కుశాల్ మెండిస్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న  కుల్దీప్.. తర్వాత అసలంక ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు.  ఇక  తొలి వన్డేలో సెంచరీ చేసిన  కెప్టెన్ దసున్ శనకను అద్భుత డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు.  ఈ మ్యాచ్ లో కుల్దీప్.. 10 ఓవర్లు బౌలింగ్ చేసి  51 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 

అయితే భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై  నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.  కుల్దీప్ ప్రదర్శనపై  పలువురు ట్విటర్ యూజర్లు స్పందిస్తూ.. ‘కుల్దీప్.. ఇక చాలులే. మరీ ఎక్కువ వికెట్లు పడగొట్టకు. నువ్వు ఇప్పటికే మూడు వికెట్లు తీశావ్. దీంతో నువ్వు నెక్స్ట్ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ కోల్పోయావ్..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఓ యూజర్ ఇలా రాసుకొచ్చాడు.. ‘కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. వామ్మో.. ఈ ప్రదర్శన కారణంగా నెక్స్ట్ మ్యాచ్ లో   కొంపదీసి కుల్దీప్ ను టీమ్ నుంచి తప్పిస్తారని నాకు భయంగా ఉంది..’ అని ట్వీట్ చేశాడు. మరో యూజర్.. ‘కుల్దీప్ ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీశాడు. అంటే గత ప్రదర్శన మాదిరిగానే తర్వాత మ్యాచ్ లో కూడా అతడిని పక్కనబెట్టేస్తారన్నమాట...’ అని కామెంట్  చేశాడు. 

 

కాగా.. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా తొలి టెస్టు ఆడిన కుల్దీప్ తొలుత బ్యాట్ తో తర్వాత బంతితో రాణించాడు. ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు.  కానీ ఏం లాభం. రెండో టెస్టులో అతడికి చోటు దక్కలేదు.  దీంతో  భారత జట్టు కూర్పుపై  విమర్శలు వెల్లువెత్తాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios