Ishan Kishan Opines About Rishabh Pant: టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్ తో తనకు పోటీ లేదని, ఎవరి ఆట వాళ్లదేనని యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అన్నాడు. 

టీమిండియా ఆల్ టైం గ్రేట్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్ కు రిషభ్ పంత్ రూపంలో మరో వికెట్ కీపర్ దొరికాడు. మిగతా వికెట్ కీపర్లతో పోలిస్తే కాస్త ముందుగానే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ కీపర్ గా రాణిస్తున్నాడు. అయితే పంత్ తో పాటు అండర్-19 ప్రపంచకప్ ఆడిన జట్టులోని సభ్యుడు, అతడి స్నేహితుడు ఇషాన్ కిషన్ కూడా టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వికెట్ కీపింగ్ తో పాటు దూకడుగా బ్యాటింగ్ చేయగల కిషన్.. రిషభ్ పంత్ కు పోటీనిస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అతడు స్పందించాడు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ తో తనకు పోటీ లేదని చెప్పాడు. రిషభ్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని.. తనను ఎప్పుడూ పోటీదారుడిగా చూడలేదని చెప్పుకొచ్చాడు. 

Scroll to load tweet…

ఇషాన్ కిషన్ మాట్లాడుతూ... ‘రిషభ్ పంత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం కలిస్తే రచ్చ రంబోలే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మేం కలిసి సినిమాలు చూస్తాం. క్రికెట్ గురించి చర్చించుకుంటాం. పంత్ తో నేను మనసువిప్పి మాట్లాడతాను. అతడు కూడా అలాగే మాట్లాడతాడని నా నమ్మకం. 

పంత్ స్థానాన్ని నేను ఆక్రమించాలని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఆ ఆలోచనే నాకు రాలేదు. పంత్ కూడా ఇలాగే అనుకుంటాడని నేను మీకు హామీ ఇవ్వగలను. క్రికెట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అయితే మా మధ్య పోటీ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు..’ అని అన్నాడు. 

వికెట్ కీపింగ్ అంటే తనకు ఇష్టమని, రిషభ్ పంత్ వంటి టాలెంటెడ్ వికెట్ కీపర్ పోటీలో ఉంటే ఎంతో ఫన్ గా ఉంటుందని, అది ఆరోగ్యకరమైన పోటీ అని అన్నాడు. కాగా.. ఈ ఇద్దరూ కలిసి 2016లో అండర్-19 ప్రపంచకప్ ఆడారు. ఆ సమయంలో ఈ ఇద్దరూ ఓపెనింగ్ జోడీగా బ్యాటింగ్ కు దిగారు. 

Scroll to load tweet…

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో ఈ సీజన్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు అతడిని రూ. 15.25 కోట్లతో దక్కించుకుంది. కాగా, ముంబై తిరిగి దక్కించుకుంటుందని తనకు తెలుసునని కిషన్ చెప్పాడు. తాను కూడా ముంబైకే వెళ్లానని అనుకున్నానని, అందుకు కారణం కూడా ఉందని కిషన్ తెలిపాడు. వాళ్లు (ముంబై) తన ఆటను బాగా అర్థం చేసుకుంటారని.. ఆ ఫ్రాంఛైజీ ఎలా పనిచేస్తుంది..? అనే విషయం కూడా తనకు బాగా తెలుసునని.. ఆ జట్టు తన కుటుంబంలా ఫీలయ్యానని కిషన్ చెప్పుకొచ్చిడు. ముంబైకి తప్ప మరో జట్టుకు వెళ్లకూడదని వేలానికి ముందే అనుకున్నానని కిషన్ చెప్పాడు.