అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండటంతో పాటు 'బ్లాక్‌ లైవ్స్ మాటర్స్'పేరుతో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో.. సాధారణ ప్రజలతోపాటు పలువురు సెలబ్రెటీలు కూడా తాము ఎదుర్కొన్న వర్ణ వివక్షను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

ఇప్పటికే క్రిస్ గేల్,  డారెన్ సామీ లాంటి క్రికెటర్లు తాము ఎదుర్కొన్న అనుభవాలను వివరించగా.. తాజాగా దీనిపై ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.

2014 ఐపీఎల్ సీజన్ లో తాను వర్ణ వివక్ష ఎదుర్కొన్నానంటూ డారెన్ సామి చేసిన వ్యాఖ్యలపై పఠాన్ స్పందించాడు. ఆ సీజన్‌లో సామీతో కలిసి పఠాన్ కూడా ఆడటం గమనార్హం. కాగా... ఐపీఎల్‌లో వర్ణ వివక్ష వ్యాఖ్యలపై తనకు అవగాహన లేదన్నాడు.

‘2014లో స్యామీతో పాటు నేనూ సన్‌రైజర్స్‌కు ఆడాను. అప్పట్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు. ఇది నిజంగా జరిగి ఉంటే కచ్చితంగా చర్చనీయాంశమయ్యేది. కాబట్టి నాకు దీనిపై అవగాహన లేదు’ అని ఇర్ఫాన్‌ వివరించాడు.

 కానీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఇలాంటి ఘటనలు అనేకమని, ముఖ్యంగా దక్షిణాది క్రికెటర్లు ఇలాంటి వివక్ష ఎదుర్కొంటారని తెలిపాడు. ఈ వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డాడు.

‘దక్షిణాది నుంచి వచ్చిన క్రికెటర్లలో కొందరు ఉత్తర భారతంలో వర్ణ వివక్షకు గురవుతుంటారు. అక్కడి ప్రజలు జాత్యహంకారులు కాదు కానీ ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకర్ని వింత పేరుతో పిలవడం ద్వారా అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలా ప్రవర్తిస్తారు’ అని పఠాన్‌ అన్నాడు.