Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సజావుగా సాగడానికి.. తెలంగాణ మంత్రిని కలిసిన అజారుద్దీన్

IND vs AUS T20I: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా  ఈనెల  25న భాగ్యనగరం రానున్నది. ఇక్కడ భారత్ తో మూడో టీ20లో పాల్గొననున్నది. 

HCA President Mohammed Azharuddin Met Telangana's Minister Srinivas Goud, Seeks Help For IND vs AUS T20I
Author
First Published Sep 19, 2022, 12:40 PM IST

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భాగ్యనగర వాసులకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కనుంది.  ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న  2021 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియాతో  మూడు టీ20 మ్యాచ్ లలో భాగంగా హైదరాబాద్ లో కూడా మ్యాచ్ ఆడనుంది.  ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆయన తెలంగాణ క్రీడా శాఖమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. 

ఈనెల 25న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ  స్టేడియంలో  భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సజావుగా సాగేందుకు  ప్రభుత్వం తరఫున సాయం అందించాలని అజారుద్దీన్.. శ్రీనివాస్ గౌడ్ ను కోరారు.  మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు  తగు సౌకర్యాలు కల్పించాలని అజారుద్దీన్ అభ్యర్థించారు. 

అజారుద్దీన్ అభ్యర్థనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. మ్యాచ్ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై ఇద్దరం చర్చించుకున్నామని.. ప్రభుత్వం తరఫున హెచ్‌సీఏకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.  మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహించేందుకు గాను పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్, తదితర శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 2019 డిసెంబర్ లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్యే ఇక్కడ చివరి మ్యాచ్ జరిగింది. మళ్లీ మూడేండ్ల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంటంతో నగరవాసులు  ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

ఇండియా - ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ : 

- సెప్టెంబర్ 20 : మొదటి టీ20 - మొహాలీ 
- సెప్టెంబర్ 23 : రెండో టీ20 - నాగ్‌పూర్ 
- సెప్టెంబర్ 25 : మూడో టీ20 - హైదరాబాద్  
(మ్యాచ్‌లన్నీ రాత్రి   7.30 గంటలకు మొదలవుతాయి) 

 

ఈ సిరీస్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే మొహాలీకి చేరుకుని ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు ముందు జరుగబోయే ఈ సిరీస్  కు ముందు ఆధిపత్యం సాధించాలని ఇరు జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios