లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎదుర్కొంటున్న మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ కోసం ఎన్నికల నగారా మోగిన వెంటనే ఆలస్యం చేయకుండా అభ్యర్థుల ఎంపికను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హర్యానాలో మరో అడుగు ముందుకేసి తాజాగా అభ్యర్థుల లిస్ట్ ను కూడా ప్రకటించింది. మొత్తం 78 మంది అభ్యర్థులతో కూడిన ఈ మొదటి లిస్ట్ లో పలువురు క్రీడాకారులకు కూడా చోటు దక్కింది. 

ఇటీవలే ప్రముఖ రెజ్లర్ బబితా పోగట్ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తన తండ్రి మహవీర్ పోగట్ తో కలిసి ఆమె కేంద్ర క్రీడా మంత్రి సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ చేరిక సమయంలోనే ఆమెకు దాద్రి అసెంబ్లీ టికెట్ దాదాపు ఖరారయినట్లేనని ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ బబితా పోగట్ ను అదే స్థానం నుండి బిజెపి బరిలోకి దింపింది. ఇలా మొదటి అభ్యర్థుల లిస్ట్ లోనే ఆమెకు చోటుదక్కింది.   

అలాగే మరో రెజ్లింగ్ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్  కూడా బిజెపి టికెట్ ఖరారయ్యింది. అతడిని బరోడా నుండి బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.  ఇటీవలే అతడు హర్యానా బీజేపీ అధ్యక్షుడు శుభాష్ బారలా సమక్షంలో పార్టీలో చేరాడు. ఈ చేరిక సమయంలో అతడికిచ్చిన హామీ ప్రకారమే బిజెపి బరోడా టికెట్ ఖరారుచేసినట్లు తెలుస్తోంది. 

యోగేశ్వర్ తో కలిసి ఒకే కార్యక్రమంలో బిజెపిలో చేరాడు మాజీ హాకీ  కెప్టెన్ సందీప్ సింగ్. అయితే అతడికి కూడా బిజెపి మొదటి లిస్ట్ లోనే  టికెట్ ఖరారయ్యింది. పెహోవా అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా సందీప్ పేరు ఖరారయ్యింది.