ఆమె వల్ల భారత క్రికెట్ పరువు పోయింది! హర్మన్‌ప్రీత్ కౌర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.. - మదన్ లాల్
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బంగ్లా టీమ్‌ని అవమానించిన టీమిండియా కెప్టెన్.. 75 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన బీసీసీఐ...

బంగ్లాదేశ్ పర్యటనలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ‘అతి’ ప్రవర్తన, ఆమె కెరీర్‌పై ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఢాకాలో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళా జట్టు 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో టీమిండియా కూడా 225 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే భారత బ్యాటింగ్ సమయంలో అంపైర్ల నిర్ణయాలపై హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది..
తనను అవుట్ అయినట్టు ప్రకటించగానే వికెట్లను బ్యాటుతో పడగొట్టి, అంపైర్‌ని తిడుతూ పెవిలియన్ చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్, మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కూడా ‘చెత్త అంపైరింగ్’ అంటూ వ్యాఖ్యలు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ అక్కడితో ఆగి ఉంటే, ఇంత పెద్ద రాద్ధాంతం జరిగి ఉండేది కాదు..
సిరీస్ డ్రాగా ముగియడంతో మ్యాచ్ అనంతరం వన్డే సిరీస్ ట్రోఫీతో ఇరు జట్లతో ఫోటో సెషన్ జరిగింది. ఈ సమయంలో బంగ్లా టీమ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.. ‘మీరు ఎందుకు వచ్చారు? మీ వల్ల మ్యాచ్ టై కాలేదు. అంపైర్లే చేశారు. వాళ్లను పిలవండి. అంపైర్లతో ఫోటో దిగడమే కరెక్ట్’ అంటూ వ్యాఖ్యానించింది హర్మన్‌ప్రీత్ కౌర్..
ఈ వ్యాఖ్యలతో చిన్నబుచ్చుకన్న బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా, తన టీమ్‌తో సహా ఫోటో సెషన్ నుంచి వాక్ అవుట్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దురుసు ప్రవర్తన కారణంగా హర్మన్‌ప్రీత్ కౌర్‌కి 75 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ..
వికెట్లను బ్యాటుతో పడేసినందుకు 50 శాతం, ఫోటో సెషన్స్ సమయంలో బంగ్లా టీమ్‌ని అవమానించినందుకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ... ఆమెకి 3 డిమెరిట్ పాయింట్లు కూడా వేసింది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఈ శిక్ష చాలదని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్..
‘బంగ్లాదేశ్ మహిళా జట్టుతో హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రవర్తన దారుణంగా ఉంది. ఆట కంటే ఆమె గొప్పది కాదు. తన వల్ల భారత క్రికెట్‌కి చెడ్డ పేరు వచ్చింది. బీసీసీఐ తనపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి...’ అంటూ ట్వీట్ చేశాడు మదన్ లాల్..
హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కనీసం 6 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించాలని ఓ క్రికెట్ ఫ్యాన్ చేసిన ట్వీట్‌ని కూడా రీట్వీట్ చేశాడు మదన్ లాల్..
హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రవర్తనపై టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన స్పందించింది. ‘హర్మన్‌ప్రీత్ కౌర్ ఎలాగైనా మ్యాచ్ గెలవాలని అనుకునే రకం. అదీకాకుండా మ్యాచ్ చాలా క్లోజ్‌గా వచ్చి, విజయం చేజారేవరకు ఆమె కాస్త కంట్రోల్ తప్పింది. తనకి క్రీడా స్ఫూర్తి తెలుసు. కానీ కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్ పోతే, మనం ఏం చేస్తున్నామో కూడా కంట్రోల్ తప్పుతాం.. దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది’ అంటూ వ్యాఖ్యానించాడు స్మృతి మంధాన..
హర్మన్‌ప్రీత్ కౌర్‌పై బీసీసీఐ బ్యాన్ వేస్తే, ఆసియా క్రీడల్లో భారత మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానకే ప్రమోషన్ దక్కొచ్చు.