హార్డిక్ పాండ్యా తన సోదరుడు కృనాల్ పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుణేలో ఇంగ్లాండ్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో 31 బంతుల్లో 58 పరుగులు చేసిన కృనాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్థసెంచరీని ఆయన తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆ తర్వాతి రోజే కృనాల్ తన పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. 

మ్యాచ్ ముగిసిన తర్వాత సోదరుడి ప్రదర్శనపై హార్డిక్ ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నిన్ను చూసి నాన్న గర్విస్తారు. ఆయన నీకు ఒక రోజు ముందే పుట్టినరోజు కానుకను ఇచ్చారంటూ ఇద్దరూ కలిసి వున్న ఫోటోను పోస్ట్ చేశాడు.

అలనాటి గాయకుడు కిశోర్ కుమార్ పాడిన ‘‘ తేరే జైసా యార్ కహాన్ ’’ ట్యూన్‌‌‌తో సెట్ చేసిన పాత ఫోటోలను హార్డిక్ షేర్ చేశాడు. ‘‘ ఈ ప్రయాణంలో తొలి నుంచి తామిద్దరం కలిసే వున్నామని .. ఎన్నో ఎత్తు పల్లాల్లో నువ్వు నా పక్కనే వుండటం అదృష్టం.. పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దన్నయ్య ’’ అంటూ హార్డ్ రాశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐదు లక్షలకు పైగా లైకులు, వందలాది కామెంట్లను ఈ వీడియో అందుకుంది. కృనాల్, హార్డిక్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే.