ముంబై : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు లండన్ లో లోయర్ బ్యాక్ సర్జరీ జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నిర్ధారించింది. శుక్రవారంనాడు అతనికి శస్త్రచికిత్స జరిగింది. 

టీమిండియా ఫిజియోథెరపిస్టు యోగేష్ పర్మార్ తో కలిసి హార్డీక్ పాండ్యా అక్టోబర్ 2వ తేదీన లండన్ వెళ్లాడు. బెంగళూరులో దక్షిణాఫ్రికాపై సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన ట్వంటీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత తనకు వెన్నునొప్పి వస్తోందని అతను చెప్పాడు. 

దాంతో బిసిసిఐ వైద్య బృందం ఇంగ్లాండులోని స్పైన్ స్పెషలిస్టులను సంప్రదించింది. సమస్యకు దీర్షకాలిక పరిష్కారం కోసం శస్త్రచికిత్స చేస్తేనే మంచిదని స్పెషలిస్టులు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని శనివారం బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

తనకు శస్త్రచికిత్స జరిగిన విషయంపై హార్జిక్ పాండ్యా ట్వీట్ చేసి తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, త్వరలోనే తిరిగి వస్తానని అతను చెప్పాడు.