ఈ నిజం జీర్ణించుకోవటం కష్టమే.. కానీ , మీరంతా గర్వపడేలా చేస్తా : హార్దిక్ పాండ్యా ఎమోషనల్ ట్వీట్
కీలకమైన ప్రపంచకప్ సమయంలో జట్టుకు దూరం కావడంతో హార్డిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. తాను జట్టుకు దూరమయ్యాననే నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే వుందని.. కానీ మీరంతా గర్వపడేలా చేస్తానని చెప్పాడు.
వన్డే ప్రపంచకప్ నుంచి భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా దూరమయ్యాడు. దీంతో అతని ఆట ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ తగిలినట్లయ్యింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో బంతిని అడ్డుకునే సమయంలో హార్డిక్ పాండ్యా గాయపడ్డాడు. చీలమండకు గాయం కావడంతో అతను జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. గాయం కారణంగా మొదల మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని జట్టు మేనేజ్‌మెంట్ చెప్పినా.. గాయం తగ్గని కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమైనట్లుగా ఐసీసీ ధ్రువీకరించింది. అతని స్థానంలో యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణను టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది.
కీలకమైన ప్రపంచకప్ సమయంలో జట్టుకు దూరం కావడంతో హార్డిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. "నేను ప్రపంచ కప్‌లో మిగిలిన భాగాన్ని కోల్పోతాను అనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. నేను జట్టుతోనే ఉంటాను. ప్రతి గేమ్‌లో ప్రతి బంతికి వారిని ఉత్సాహపరుస్తాను. అందరి శుభాకాంక్షలకు, ప్రేమకు, నాకు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. ఈ జట్టు ప్రత్యేకమైనది , ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని పాండ్యా ట్విట్టర్‌లో రాశారు.
ఇకపోతే.. హార్డిక్ పాండ్యా.. ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు బంతులను వేశాడు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లను తీశాడు. ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గాయం కారణంగా హార్డిక్ పాండ్యా జట్టుకు దూరం కావడంతో టీమిండియా రెండు మార్పులు చేసింది. మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్‌లను జట్టులోకి తీసుకుంది. అలాగే శార్ధూల్ ఠాకూర్‌ను రిజర్వ్ బెంచ్‌లోకి వుంచారు. పాండ్యా గాయపడినప్పటికీ భారత్ జట్టు తిరుగులేని ఫామ్‌లో వుంది. టీమిండియా ఇప్పటికే భారత్ సెమీపైనల్‌కు అర్హత సాధించగా.. మొత్తం టోర్నీలోనే ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింంది. రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.