ఐసిసి టీ20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియాకు వరుస ఎదురెదబ్బలు తగులుతున్నాయి. 2020లో జరగనున్న ఈ మెగా టోర్నీకోసం ఆటగాళ్లను ఇప్పటినుండే సంసిద్దం చేసే పనిలోపడింది టీమిండియా మేనేజ్‌మెంట్. కానీ ఆ ప్రయత్నాలకు ఆటగాళ్ల గాయాలు దెబ్బతీస్తున్నాయి. ఇలా ఇప్పటికే కీలక బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా మరో కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా సేమ్ ఇలాగే తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమయ్యాడు. 

హార్దిక్ పాండ్యా రోజూ మాదిరిగానే మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. గతకొంతకాలంగా అతడు వెన్నునొప్పితో బాధపడుతుండగా అది ఈ ప్రాక్టీస్ లో మరింత తీవ్రవమయ్యింది. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిన అతన్ని సహాయకసిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 

వైద్యపరీక్షల అనంతరం అతడి గాయం తీవ్రత అధికంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.  దాదాపు ఐదునెలల పాటు అతడు క్రికెట్ కు పూర్తిగా దూరంగా వుండాలని సూచించారట. అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని డాక్టర్లు సూచించినట్లు ఓ బిసిసిఐ అధికారి వెల్లడించారు.

ఇప్పటికే బుమ్రా కు మెరుగైన వైద్యం అందించేందుకు ఇంగ్లాండ్ కు పంపించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇదే వెన్ను సమస్యతో బాధపడుతున్న హార్దిక్ కు కూడా అక్కడే చికిత్స చేయించాలని భావిస్తున్నట్లు సదరు బిసిసిఐ అధికారి తెలిపారు. లండన్ లోని ప్రముఖ వైద్యనిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందించి టీ20 ప్రపంచ కప్ నాటికి వీరిద్దరిని సంసిద్దం చేయనున్నట్లు బిసిసిఐ అధికారి వెల్లడించారు.