టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తూ... విమర్శిస్తున్నారు. గతంలో.. ఓ టీవీలో షోలో మహిళలపై అసభ్యకరమైన రీతిలో మాట్లాడి విమర్శల పాలైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. మరోసారి అలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నాడు. 

టీమిండియాలో సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్‌కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్‌ ఓ వీడియోను షోర్‌ చేశాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో.. హార్దిక్ జహీర్ ఖాన్ ని విమర్శించాడు. దీంతో... నెటిజన్ల ఆగ్రహానికి హార్దిక్ గురయ్యాడు.

‘హ్యాపీ బర్త్ డే  జాక్.. నేనిక్కడ కొట్టినట్లు నువ్వు కూడా మైదానం బయటికి దంచి కొడతావనే ఆశిస్తున్నా’ అని పేర్కొంటూ ఓ దేశవాళీ క్రికెట్ సందర్భంగా జహీర్ ఖాన్ బౌలింగ్ లోతాను సిక్స్ కొట్టిన వీడియోని షేర్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు హార్దిక్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో సీనియర్‌ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్‌ అహంకారానికి ఇదే నిదర్శమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు. 

గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు సర్జరీ పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్‌ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చారు. కాగా... ఇప్పుడిప్పుడే హార్దిక్ ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు.