Asianet News TeluguAsianet News Telugu

Ind Vs Nz: నీ కష్టం వృథా కాలేదు బ్రో..! గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Shreyas Iyer: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అరంగ్రేట ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. స్కోరుబోర్డుపై 120 పరుగులు కూడా చేరకుండానే టాపార్డర్ కుప్పకూలడంతో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. భారత్ ను రేసులోకి తెచ్చాడు. 

Hard Work Paid Off: Twitter Reacts To Shreyas Iyer After his Super Knock in First Test Against New Zealand
Author
Hyderabad, First Published Nov 25, 2021, 5:55 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా కాన్పూర్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో  భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. 120 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో  క్రీజులోకి వచ్చిన  అరంగ్రేట ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. తొలి  టెస్టులోనే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సారథి రహానే, రవీంద్ర జడేజా తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.  భారత్ ను భారీ స్కోరు దిశగా  పరుగులెత్తిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ  గైర్హాజరీలో  టెస్టు జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న ఈ ముంబై ఆటగాడు.. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్టులోనే ఒత్తిడి లేకుండా.. ప్రత్యర్థులు కవ్విస్తున్నా లొంగకుండా.. భారత ఇన్నింగ్స్ కు బ్యాక్ బోన్ లా నిలిచాడు.  తొలి రోజు 136 బంతులాడిన అయ్యర్.. 75 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. అయితే శ్రేయస్ ప్రదర్శనపై ట్విట్టర్ లో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయ్యర్ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘భారత జట్టులోకి ఎంపికై తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు. నీ కష్టం వృథా కాలేదు బ్రో..’ అని పేర్కొన్నాడు. 

 

నాలుగేండ్ల క్రితమే భారత జట్టులోకి వచ్చినా టెస్టు టీమ్ లోకి రావడానికి అయ్యర్ కు  చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. అయితే గతేడాది అతడి చేతికి గాయం కావడంతో తిరిగి కోలుకుని మళ్లీ  క్రీజులోకి రావడం కష్టమని  కామెంట్స్  వినిపించాయి. కానీ వాటన్నింటిని దాటుకుని అయ్యర్ టీ 20తో పాటు టెస్టు జట్టులో కూడా స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు బాటలు ఏర్పరుచుకున్నాడు.

 

ఇదే విషయమై ఒక యూజర్ స్పందిస్తూ.. ‘అతడికి గాయమైనప్పుడు  కొంతమంది అతడి పని అయిపోయిందని అని వ్యాఖ్యానించారు. కానీ దేవుడు అతడితో ఉన్నాడు.  టెస్ట్ కెరీర్ కు ఇంతకంటే మంచి ఆరంభం ఉండదు.. ’ అని రాసుకొచ్చాడు. 

కాగా అయ్యర్ అరంగ్రేటం అనంతరం  అతడి తండ్రి సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘టెస్టు క్రికెట్ ఆడటం అతడి (శ్రేయస్) అంతిమ లక్ష్యం.  నేను కూడా ఎప్పుడూ దానిమీదే ఫోకస్ పెట్టమని చెప్పేవాడిని. అయితే అది త్వరలోనే జరిగి తీరుతుందని శ్రేయస్ చెప్పేవాడు. ఇప్పుడు అది నిజమైంది. ఎట్టకేలకు నా కొడుకు కల సాకారమైనందుకు సంతోషంగా ఉంది.  నాలుగేండ్లుగా నేను నా కొడుకు ఫోటో ఉన్న డీపీ మార్చలేదు. అతడు ఈ ఫార్మాట్ లో కూడా అద్భుతంగా రాణిస్తాడని నమ్ముతున్నాం.  స్టార్ ప్లేయర్లు లేనందున రాణించడానికి శ్రేయస్ కు ఇది మంచి అవకాశం..’ అని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios