పూణేలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 98 పరుగులు చేసిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో రోజులుగా సరైన ఫామ్‌లేక విమర్శలు ఎదుర్కొన్న గబ్బర్.. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు.

ఈ నేపథ్యంలో ధావన్ ఫామ్‌లోకి రావడం  సంతోషకరమన్నాడు భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌. పూణేలో ప్రదర్శనతో అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయని ఆయన అన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని సన్నీ ప్రశంసించారు. 

శిఖర్‌ వయసుపై చాలా చర్చ జరిగిందని.. అతనికిప్పుడు 35 ఏళ్లని వచ్చే డిసెంబర్లో 36వ వసంతంలోకి అడుగుపెడతాడని గవాస్కర్ అన్నారు. 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు అతడు ఉంటాడా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.

వీటన్నిటినీ పక్కన పెట్టి అతడు తన ఆటపై దృష్టిపెట్టడం, పరుగులు చేయడం సంతోషకరమని గవాస్కర్ ప్రశంసించారు. రోహిత్‌ శర్మతో కలిసి ధావన్‌ విధ్వంసకరమైన భాగస్వామ్యాలు ఇచ్చాడని.. జట్టును ఎన్నో సార్లు గెలిపించాడని సునీల్ గవాస్కర్ ప్రశంసించారు.  

క్రీజులో ఎక్కువ సమయం గడపడం, బంతిని చక్కగా మిడిల్‌ చేయడంతో ధావన్‌ ఆత్మవిశ్వాసం పెరిగిందని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రోహిత్‌ సాధారణంగా ఆడేంత బాగా ఈ సారి ఆడలేకపోయాడని.. అందుకే శిఖర్‌ ధావన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడని సన్నీ వ్యాఖ్యానించారు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా బాదిన సిక్సర్‌ అద్భుతమని గవాస్కర్ చెప్పారు.