Asianet News TeluguAsianet News Telugu

హనుమ విహారి ‘ఒంటిచేతి’ పోరాటం... కుడి చేతికి ఫ్యాక్చర్! సింగిల్ హ్యాండ్‌తో ఎడమ చేతి బ్యాటింగ్...

రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌తో తలబడుతున్న ఆంధ్రా జట్టు... ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆంధ్రా కెప్టెన్ హనుమ విహారి చేతికి గాయం! లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తూ అద్భుత పోరాటం.. 

Hanuma Vihari batting with left handed and just one hand in Ranji Trophy Quarter Finals CRA
Author
First Published Feb 1, 2023, 1:21 PM IST

మామూలుగానే తెలుగోళ్లకు కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. దేన్నీ అంత ఈజీగా పట్టుకోరు, పట్టుకుంటే ఓ పట్టాన ఓటమిని ఒప్పుకోవడానికి అంగీకరించరు. కాకినాడ కుర్రాడు, టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువే మొండి ఘటం. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల ధాటికి చేతి వేళ్లు చిట్టిపోయినా.. పట్టువిడువకుండా క్రీజులో పాతుకుపోయినా సిడ్నీ టెస్టును డ్రా చేసిన హనుమ విహారి.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు...

విదేశాల్లో జరిగే టెస్టుల్లో తప్ప, స్వదేశంలో జరిగే  మ్యాచుల్లో హనుమ విహారికి పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు బీసీసీఐ. అప్పుడెప్పుడో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో ఆడిన హనుమ విహారి, బంగ్లాదేశ్‌ టూర్‌కి సెలక్ట్ కాలేకపోయాడు...

ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టు తరుపున ఆడుతున్న అద్భుతమైన పోరాట ప్రటిమతో అందరి మన్ననలు పొందుతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ఆంధ్రా జట్టు, రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 127 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 379 పరుగులు చేసింది...

ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ 48 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేయగా అభిషేక్ రెడ్డి 21 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ హనుమ విహారి‌, మొదటి రోజు ఆటలో గాయపడ్డాడు...

మధ్యప్రదేశ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ వేసిన ఓ బంతి, హనుమ విహారి కుడిచేతి మణికట్టుకి బలంగా తాకింది. ఈ గాయం కారణంగా విహారి, రిటైర్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు..

రికీ భుయ్ 250 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 149 పరుగులు చేయగా కిదంత్ కరణ్ షిండే 264 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు చేసి సెంచరీలు అందుకున్నారు...

ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 245 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత అశ్విన్ హెబ్బర్ 11, షోయబ్ ఖాన్ 5, పృథ్వీరాజ్ యర్రా 2 పరుగులు చేసి అవుట్ కాగా నితీశ్ రెడ్డి, శశికాంత్ డకౌట్ అయ్యారు. ఒకానొక దశలో 323/2 స్కోరుతో ఉన్న ఆంధ్రా జట్టు, 30 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి 353/9 స్థితికి చేరుకుంది...

దీంతో రిటైర్ హర్ట్‌గా పెవిలియన్ చేరిన హనుమ విహారి, తిరిగి క్రీజులోకి వచ్చాడు. కుడి చేత్తో బ్యాటుని పట్టుకోవడానికి కూడా కష్టంగా మారడంతో లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశాడు. సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తూ లలిత్ మోహన్‌తో కలిసి ఆఖరి వికెట్‌కి అజేయంగా 26 పరుగులు జోడించి క్రీజులో ఉన్నాడు...

కుడి చేత్తో సింగిల్ హ్యాండ్‌ బ్యాటింగ్ చేయడమే చాలా కష్టం. అలాంటిది లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తూ బౌండరీలు బాది, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు హనుమ విహారి. 

ఫిబ్రవరి 9 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి ప్రకటించిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కలేదు. ఆంధ్రా జట్టు మంచి ఆటతీరుతో క్వార్టర్ ఫైనల్ చేరుకుంటే మరోవైపు రంజీ ట్రోఫీ 2022-23 ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుస పరాజయాలతో ఒకే ఒక్క పాయింట్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది. సీజన్‌లో దారుణ ప్రదర్శనతో వచ్చే ఏడాది ప్లేట్ గ్రూప్‌లో ఈశాన్య రాష్ట్రాలతో తలబడనుంది హైదరాబాద్ టీమ్... 

Follow Us:
Download App:
  • android
  • ios